HYDRAA | నాలా ఆక్ర‌మ‌ణ‌లు క్లియ‌ర్ చేస్తాం – హైడ్రా చీఫ్ రంగనాథ్

సికింద్రాబాద్ ప్యాట్నీ సెంట‌ర్లో కూల్చివేత‌లు షురూ
నిన్న పరిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌
నేడు ఉద‌యాన్నే ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు ప్రారంభం
షాపులు తొల‌గించ‌డంతో ఫ్యాట్నీసెంట‌ర్ రోడ్డు విశాలం
హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న స్థానిక ప్ర‌జ‌లు, లీడ‌ర్లు

హైద‌రాబాద్, ఆంధ్రప్రభ : వ‌ర్షాకాలం ప్రారంభంతో హైడ్రా అధికారులు హైదరాబాద్ సిటీలో నాలాల సమస్యపై ప్రత్యేక దృష్టిసారించారు. నాలాలపై ఆక్రమణలను అరికట్టేందుకు.. ఇప్పటికే ఉన్నవాటిని తొలగించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్న‌ట్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని నాలాలపై ప్రత్యేక డ్రైవ్‌ ప్రారంభించినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా సికింద్రాబాద్ ప్యాట్నీ సెంట‌ర్‌లో నాలాల‌పై నిర్మించిన వాణిజ్య స‌ముదాయ‌ల‌ను కూల్చివేత‌ల‌ను శుక్ర‌వారం ఉద‌యం ప్రారంభించారు.

70 అడుగుల నాలా.. 15 అడుగుల‌కు

కాగా, 70 అడుగుల విస్తీర్ణంలో ఉండాల్సిన నాల కబ్జాలతో 15 నుంచి 18 అడుగులకు పరిమితమైన చోట హైడ్రా చర్యలు చేప‌ట్టింది. నాల ఆక్రమణకు గురి అవ్వడంతో పాయిగ కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ కాలనీ, విమాన నగర్, బెల్ కాల‌నీ, ఇందిరమ్మ నగర్ నీట మునుగుతున్నట్టు అంత‌కు ముందు హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు… ఫిర్యాదులను గురువారం కంటోన్మెంట్ సిఈవో మధుకర్ నాయక్, మున్సిప‌ల్, ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులతో కలసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా నాలా ఆక్రమణలతో వేలాది నివాసాలు నీట మునిగిన పాత చిత్రాలను సెల్ఫోన్లలో రంగ‌నాథ్ కు స్థానికులు చూపించారు.. 70 అడుగులకు పైగా ఉన్న నాలా 55 నుంచి నుంచి 60 అడుగుల మేర ఆక్రమణలు గురి అయినట్టు నిర్ధారించారు అధికారులు. ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.. అలాగే భవిష్యత్ లో ఆక్రమణలకు గురి కాకుండా వెంటనే హద్దులు నిర్ణయించి నాలకు ఇరువైపులా ప్రహరీలు నిర్మించాలని కంటోన్మెంట్ అధికారులు నిర్ణ‌యించారు. ఇక నేటి ఉద‌యం నాల ఆక్రమణల కూల్చివేతలు ప్రారంభించింది.. దీంతో అయిదు కాల‌నీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. దశాబ్దాల నరకానికి మోక్షం లభించింది అంటూ సంతోషం వ్యక్తం చేసి హైడ్రా చీఫ్ కు కృతజ్ఞ‌త‌లు తెలిపారు స్థానికులు.

అన్ని నాలాల‌పై ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గిస్తాం: రంగ‌నాథ్

రాబోయే నాలుగు నెలల పాటు నాలాల అంశంపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ ఈ సంద‌ర్భంగా మీడియాకు వివరించారు. ముఖ్యంగా నగరంలో వరద నీరు తరచుగా నిలిచిపోయే ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేకంగా అధ్యయనం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా సమస్య మూలాలను కనుగొని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. నాలాలు, ఇతర నీటి వనరులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్ హెచ్చరించారు. ముఖ్యంగా నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, వాటిని తక్షణమే తొలగిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అయితే, పేదలు నివాసం ఉంటున్న నిర్మాణాల విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి, ఆ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయని, దానికి ఉదాహరణగా రసూల్‌పురా నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించినట్లు కమిషనర్ రంగనాథ్ గుర్తు చేశారు. నగరంలో నాలాల వ్యవస్థను పరిరక్షించి, వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తమ ప్రణాళికలు కొనసాగుతాయని ఆయన దృఢంగా చెప్పారు.

Leave a Reply