రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్‌లో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చేరికల కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కర్నాల అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో, జిల్లా సెస్ అసిస్టెంట్ హెల్పర్స్‌లో 100 మందికి పైగా వివిధ సంఘాల నుంచి బయటకు వచ్చి యూనియన్‌లో చేరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. స్వామి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి. గోవర్ధన్ సమక్షంలో వీరందరిని కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా ఎన్. స్వామి, వి. గోవర్ధన్ మాట్లాడుతూ
‘‘2018లో అసిస్టెంట్ హెల్పర్ నియామకాలు జరగ్గా, 2020లో ప్రొబేషన్ పీరియడ్ పూర్తయింది. అయితే అప్పటి నుంచి ఐదు సంవత్సరాలు గడిచినా అసిస్టెంట్ హెల్పర్లను హెల్పర్‌గా ప్రమోట్ చేయకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్, సెస్ చైర్మన్ తక్షణం జోక్యం చేసుకొని అసిస్టెంట్ హెల్పర్లకు హక్కైన పదోన్నతులు కల్పించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ తరఫున డిమాండ్ చేశారు. అలాగే సంస్థ అభివృద్ధి, పరిరక్షణలో యూనియన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని’’ స్పష్టం చేశారు.
తరువాత సెస్ చైర్మన్, ఎండికి వినతిపత్రం సమర్పించగా, వారు సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు. యూనియన్‌పై విశ్వాసం ఉంచి చేరిన సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సింగిరెడ్డి చంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, శ్రీనివాస్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు అంజనేయులు, నాయకులు కొమురయ్య, సిటూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కార్యదర్శి రమణ, సెస్ అసిస్టెంట్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు.