పేదింటి ఆడపడుచుల కలలు నిజమైన వేళ..

పేదింటి ఆడపడుచుల కలలు నిజమైన వేళ..
ఇందిరమ్మ పాలనలలో పేదింటి ఆడపడుచుల కలలు నిజం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి
చిట్యాల,ఆంధ్రప్రభ : పరాభవనామ ఉగాది పర్వదినాన జిల్లాకలెక్టర్, నకిరేకల్ ఎమ్మెల్యే ల సమక్షంలో గృహప్రవేశాలు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇంటి ద్వారా గృహవసతి కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గురువారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం, చిట్యాల మండలం, గుండ్రంపల్లి, పెదకాపర్తి గ్రామాలలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం తో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఇందిరమ్మ గృహా లబ్ధిదారులతో ఆనందోత్సాహాల మధ్య నూతన గృహప్రవేశాలు చేయించారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక సందర్భంగా అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లాలో 6,409 ఇందిరమ్మ గృహా ప్రవేశా లు నిర్వహించాలని లక్ష్యాన్ని నిర్ధేశించినట్లు తెలిపారు. అందులో భాగంగా ఉగాది రోజు నుండి వచ్చే రెండు, మూడు రోజుల్లో 2281 గృహప్రవేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలోనే 348 ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకు అధికారులు అందరూ సమన్వయంతో పని చేసి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చిన 5 లక్షల రూపాయలు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇంటి ద్వారా వారి కల సాకారం చేసుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే సహకారంతో మిగిలిన ఇళ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పేదలకు నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలను చేయించివారి ఇంటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు . ఇందిరమ్మ గృహాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

నకిరేకల్ నియోజకవర్గానికి తొలి విడతన 3,500 ఇండ్లు మంజూరు కాగా, అందులో 300కి పైగా ఇళ్లను ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. గుండ్రంపల్లి, పెదకాపర్తి గ్రామాల్లో సామూహిక గృహప్రవేశాలు నిర్వహించడం ఆనందదాయకమని,రాష్ట్రంలో తొలి విడత నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో రెండో విడత ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా నియోజకవర్గంలో పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కూడా కలెక్టర్ సహకారంతో అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
రానున్న రెండు సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి అర్హులైన పేద కుటుంబానికి ఇల్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు అందించిన ఇందిరమ్మ ఇళ్లతో తమ సొంత ఇంటి కల నెరవేరిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే , జిల్లా కలెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, తహసిల్దార్ బక్కతట్ల విజయ ,ఎంపీడీవో ఎస్పీ జయలక్ష్మి, హౌసింగ్ డిఇ అబ్దుల్ వాజిద్ ,హౌసింగ్ ఏఈ ప్రీతి ,సర్పంచ్ కాటo వెంకటేశం, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంక రెడ్డి, ఆవుల సుందర్, కార్యదర్శి గౌతం రెడ్డి, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
