Home Guard Raising Day | పోలీసు వ్యవస్థకు వెన్నుముక..

Home Guard Raising Day | పోలీసు వ్యవస్థకు వెన్నుముక..

  • ప్రజా రక్షణలో వారి సేవలు అనిర్వచనం..
  • సమర్థమంతమైన సేవలు వీరికే సాధ్యం…
  • విజయవాడ పోలీస్ కమీషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు..
  • 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు..
  • ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసా పత్రాలు..

Home Guard Raising Day, విజయవాడ, ఆంధ్రప్రభ : పోలీసు వ్యవస్థకు వెన్నుముక హోంగార్డులేనని విజయవాడ (Vijayawada) పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. విజయవాడలోని ఏఆర్ గ్రౌండ్స్ లో శనివారం 63వ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించారు. ఈ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ముఖ్యఅతిధిగా పాల్గొనగా హోంగార్డ్ లు గౌరవ వందనం సమర్పించి, సాదరంగా ఆహ్వానించారు. పెరేడ్ కమాండర్ హోంగార్డ్ 116 ఎన్.సాయి కుమార్ నేతృత్వంలో 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవమును పురస్కరించుకుని లయబద్దంగా చక్కటి పెరేడ్ నిర్వహించి పోలీస్ కమీషనర్, ఇతర అధికారులకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ రాజశేఖర్ బాబు మాట్లడుతూ.. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డులు అందరికి శుభాకాంక్షలు. విజయవాడ సిటీలో పోలీస్ (Police) కమీషనరేట్ లో మొత్తం 1000 మంది హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, సి.ఐ.డి, టాస్క్ ఫోర్స్ పోలీస్ అంతర్గత భద్రతా, పోలీస్ వాహనాల డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లందు భద్రత కొరకు అనేక టెక్నికల్ కేటగిరీలో పని చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పర్యవేక్షణ, టెక్నీషియన్లుగా కూడా విధులను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కోవిడ్ వంటి అత్యవసర విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు విధులు నిర్వహించటం, మతసామరస్యాన్ని కాపాడటం, ఆర్ధిక, సామాజిక, సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇవన్నీ హోంగార్డుల విధులలో భాగమేనన్నారు.

విజయవాడ సిటీ పరిధిలో వి.వి.ఐ.పి, వి.ఐ.పి.ల బందోబస్తులు, దసరా నవరాత్రులు, మేరిమాత ఉత్సవాలు, భవాని దీక్షలు లాంటి బందోబస్తులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు, నైట్-బీట్స్, డే-బీట్స్, కమ్యూనికేషన్ విభాగాలలో వీరు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎక్స్ గ్రేషియా 5 లక్షల రూపాయలు చొప్పున అందిస్తున్నాం అన్నారు. ఆయన ఈ సంవత్సరంలో మరణించిన నలుగురు హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పారు. అంతేకాక ఈ సంవత్సరంలో మరణించిన 4 హోంగార్డుల కుటుంబాలకు, పదవీ విరమణ చేసిన (13) మంది హోంగార్డులకు ఒకరోజు వేతనాన్ని ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 85 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. మరణించిన హోంగార్డు కుటుంబ సభ్యులలో అర్హులు అయిన నలుగురికి కారుణ్య నియామకం క్రింద హోంగార్డు ఉద్యోగం ఇచ్చామన్నారు.

హోంగార్డుల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్ క్రింద 2,000 రూపాయలు నుండి 6,000/- రూపాయలు వరకు అందిస్తున్నాం అన్నారు. ఈ సంవత్సరం 2025లో 40 మంది హోంగార్డుల పిల్లలకు ఇవ్వటం జరిగినది. హోంగార్డులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 30 వేల రూపాయలు అదనంగా చేస్తున్నామన్నారు. హోంగార్డుల సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పథకాలు ఇప్పటి వరకు 55 మంది హోంగార్డులకు సీనియారిటీ ప్రాతిపదికన ఇవ్వడం జరిగిందన్నారు. హోంగార్డులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల పదవి విరమణ చేసిన హోంగార్డులను కమిషనర్ రాజశేఖర్ బాబు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి పోలీస్ కమీషనర్లు డి.సి.పి.లు కృష్ణ ప్రసన్న, ఎస్.వి.డి.ప్రసాద్, హోంగార్డ్స్ కమాండెంట్ టి.ఆనందబాబు, క్రైమ్ ఏ.డి.సి.పి. రాజారావు, ఏ.ఆర్. ఏ.డి.సి.పి. కె.కోటేశ్వర రావు, ఏ.సి.పి.లు. ఇన్స్పెక్టర్లు, హోంగార్డ్స్ ఆర్.ఐ. సుధాకర్ రెడ్డి, సుమారు 200 హోంగార్డ్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply