ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యమే మహాభాగ్యం..

ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యమే మహాభాగ్యం..
కుంటాల, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వల్లే ప్రజల ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ పేర్కొన్నారు. కుంటాల మండలంలోని పెంచికల్ పాడు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం పై రైతలుకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేసి పెట్టుబడులు తక్కువ పెట్టి ఎక్కువ మోతాదులో దిగుబడులు సాధించాలని రైతులకు తెలియజేశారు. అదే విధంగా పంటలు సాగు విధానాల గురించి వివరించారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ పథకం కింద ఎంపికైన గ్రామాల రైతులకు వ్యవసాయ కిట్లు పంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రైతు దీనిని అలవర్చుకోవా లని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలు ఎటువంటి రసాయనాల కలుషితానికి లోనవకుండా స్వచ్ఛంగా ఉంటాయని తెలిపారు. అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల మనుషులు ఆరోగ్యంగా, శక్తివంతంగా జీవించగలరన్నారు. గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని వివరించారు.
నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కింద ఎంపికైన రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేయాలని సూచించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. అదే విధంగా రైతులకు అధిక మోతాదులో యూరియా వాడకూడదు అని తెలియజేశారు. నానో యూరియా పై రైతులు దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రైతులకు పంటల మార్పిడి మూలంగా మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసుకుని పంటలకు పిచ్చకారులు చేయాలని వివరించారు.
అదే విధంగా ప్రకృతి సాగు విధానంలో పంటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సాయినాథ్.. రైతులకు పలు సలహాలు సూచనలు అందించారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయం ఒక్క ఎకరంలో సాగు చేస్తున్న రైతులకు సంవత్సరానికి 4000 రూపాయల ప్రోత్సాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్టు తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ ను స్థానిక సర్పంచ్, రైతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్య క్రమంలో స్థానిక సర్పంచ్ కదం హిమ్మత్ రావు, పటేల్, మండల వ్యవసాయ అధికారి విక్రం, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి గణేష్, ఉప సర్పంచ్ రాములు, ప్రకృతి వ్యవసాయ రైతు సాయినాథ్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
