న్యూ ఢిల్లీ- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయు)భూములను వేలం వేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను వెంటనే నిలువరించాల్సిందిగా బీఆర్ఎస్ ఎంపీలు కే.ఆర్.సురేష్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,దీవకొండ దామోదర్ రావులు కేంద్ర విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ రవిచంద్ర,విప్ దామోదర్ రావులు బుధవారం ఢిల్లీలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నెలకొన్న సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విలువైన భూములలో 400 ఎకరాలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఎంపీలు మంత్రికి వివరించారు.
ఈ భూములలో చెరువులు,కుంటలతో పాటు అరుదైన వృక్ష జాతులు,జింకలు, నెమళ్లు, సరీసృపాలతో జీవ వైవిధ్యం నెలకొని ఉందని,పరిసర ప్రాంతాల వారికి స్వచ్ఛమైన సహజవాయువు దొరుకుతున్నదన్నారు. ఎంతో విలువైన, తమ యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు గాను ఉన్న ఈ భూములను వేలం వేయకుండా నిలువరించాలని కోరుతూ విద్యార్థులు, మేధావులు ఆందోళన బాట పట్టిన విషయాన్ని ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్ర, దామోదర్ రావులు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తెచ్చారు. మంత్రి వెంటనే స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎంపీలకు హామీనిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీల వెంట రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్,బీఆర్ఏస్వీ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్,తుంగబాలు, సెంట్రల్, ఉస్మానియా యూనివర్సిటీలకు చెందిన పలువురు విద్యార్థి నాయకులు ఉన్నారు.