Hari Hara Veera Mallu: తెలంగాణ స‌ర్కార్ క‌రుణ.. ప్రీమియ‌ర్ షోలు, ధ‌ర‌ల పెంపున‌కు ఓకే

హైద‌రాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) విడుదలకు కౌంట్ డౌన్ మొదలైంది. పాన్ ఇండియా (Pan India) రేంజ్‌లో జూలై 24న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ (Film shooting) నుంచి ప్రమోషన్ల వరకూ హై లెవల్‌ లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ (Hyderabad) లో గ్రాండ్ ప్రెస్ మీట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి హైప్‌ను మరింత పెంచారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

తెలంగాణ ప్రభుత్వం తాజాగా హరిహర వీరమల్లు చిత్రబృందానికి ప్రత్యేక అనుమతులు (Special permissions) మంజూరు చేసింది. ఇది చిత్ర యూనిట్‌కే కాదు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా శుభవార్తగా మారింది. సాధారణంగా టికెట్ ధరల పెంపు అనేది ప్రత్యేక దృష్టిని ఆకర్షించే అంశం. ఈ సినిమాకు విడుదలకు ముందు నుంచే ఆ అవకాశం లభించడం విశేషం. ఈ నెల 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోల నిర్వహణ కోసం ఒక్కో టికెట్ ధరను రూ.600 వరకు నిర్ణయించుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. దీనితో ప్రీమియర్ షోల కోసం భారీగా టికెట్ల డిమాండ్ ఉంటుందని చెప్పవచ్చు.

ఇక సినిమా విడుదలైన ఈ నెల‌ 24 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలో రూ.150, మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు టికెట్ ధర పెంచుకోవచ్చని అధికారికంగా అనుమతి లభించింది. ఈ చిత్రానికి మొదట క్రిష్ దర్శకుడిగా ఉన్నా, తర్వాత జ్యోతికృష్ణ బాధ్యతలు చేపట్టారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ఏఎం రత్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పుడు సర్కార్ ఇచ్చిన టికెట్ రేట్ల పెంపుతో హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లకు రంగం సిద్ధమైంది. ఇక ఓపెనింగ్స్ ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.

Leave a Reply