- దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా ఉత్పత్తులు ఒకే వేదికపై..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : హస్తకళలను ప్రోత్సహించి, కళాకారులను ఆదరించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్స్) మోకా సత్తిబాబు తెలిపారు. విజయవాడ ఆటోనగర్ బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీసాయిబాబా కళ్యాణ మండపంలో ఎపిట్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తుల థీమాటిక్ ఎగ్జిబిషన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఒకే వేదికపై అందుబాటులో ఉంచి అమ్మకాలు జరగేలా నేటి నుండి 12వ తేదీ వరకు పది రోజులపాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. ప్రాచీన హస్తకళలు, భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారుచేసి సుమారు 50 స్టాల్స్‌లో ప్రదర్శన-అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌ను ఆదరించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డెవలప్‌మెంట్ కమిషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్. అపర్ణ లక్ష్మి మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కమిషన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ థీమాటిక్ ఎగ్జిబిషన్‌లో కర్నాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, రాజస్థాన్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండపల్లి, ఏటికొప్పాక వంటి ప్రసిద్ధ హస్తకళా ఉత్పత్తులు కూడా ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు జరుపుతున్నామని వెల్లడించారు.
కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఎన్. ప్రియాంక, ఏపీ స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ. శేఖర్, ఎపిట్కో ప్రతినిధి డి. సుధీర్ కుమార్ పాల్గొన్నారు.

