దండారీ వేడుకల్లో గుస్సాడి సందళ్లు..
- ఆదివాసి గూడేల్లో దీపావళి సంబరం..!
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఆదివాసీ గిరిజనులు అత్యంత వైభవంగా జరుపుకునే దండారి వేడుకలు దీపావళి పండుగకు కొత్త శోభను తెచ్చిపెట్టాయి. సంస్కృతి, సాంప్రదాయాలు సనాతన ఆచార వ్యవహారాలు ఉట్టిపడే రీతిలో దీపావళి పండుగ రోజు ఆదిలాబాద్(Adilabad) ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ గిరిజన పల్సంబరాలతో దండారి సంబరాలతో మిన్నంటాయి.
అన్ని పనులు వదిలేసి ఆదివాసి బిడ్డలంతా మమేకమై గుస్సాడి నృత్య(Gussadi dance) వేషధారణతో కాళ్లకు గజ్జలు కట్టుకొని డప్పుల వాయిద్యాల మధ్య సంబరాల్లో పాల్గొన్నారు. మహిళలు రేలా రేలా పాటలతో గుంపులుగా “చాచోయ్” నృత్యాలు చేస్తూ అలరించారు. ఆదివాసి పల్లెలన్నీ పండగ వాతావరణం సంతరించుకున్నాయి.
దండారి ఉత్సవాలకు సర్కారీ కానుకలు ఏవి..?
ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి వేడుకలను అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం సార్ మేడిలు, ఆదివాసి బృందాలకు ఇంతవరకు నగదు ప్రోత్సాహకం కింద కానుకలు ఇవ్వలేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Anil Jadhav) అన్నారు. నేరడి గొండలో తలమడుగు మండలం బరంపూర్, బోత్ మండలం జైనురుపల్లి తదితర ఆదివాసి గూడేల నుండి గుస్సాడి బృందాలు తరలివచ్చి దండారి నృత్యాలతో అలరించారు.
లయబద్ధంగా గిరిజనులు గుస్సాడీ నృత్యాలు చేస్తూ దీపావళి పండుగ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కూడా వారితో కలిసి దండారి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు దండారి కానుకల కింద నగదు ప్రోత్సాహకాలు రూ.15 వేలు అందించాలని, గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని కోరారు.

