గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు పూర్తిచేయాలి

వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో వలసలను అరికట్టేందుకు గుండ్రేవుల, వేదవతి, సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు, కర్నూలు జిల్లా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జె. లక్ష్మీనరసింహ యాదవ్‌లకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ ఆదోని డివిజన్‌లో వలసలు ఆగాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రతి వేసవి కాలంలో ఆదోని ప్రాంత ప్రజలు తట్టబుట్టలు సర్దుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని, విద్యార్థుల చదువుకు అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, ఇక్కడి ప్రజలు ఇక్కడ బ్రతకడానికి స్వేచ్ఛ రాలేదు. 2014లో ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తామని, ప్రజల వలసలను అరికడతామని హామీ ఇచ్చి శిలాఫలకం వేశారు. కానీ ఆ తర్వాత పురోగతి కనిపించలేదన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుండ్రేవుల ప్రాజెక్టు కోసం భూ సర్వే నిర్వహించారని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తై ప్రజల వలసలు ఆగేవి, అని అనంతరత్నం మాదిగ పేర్కొన్నారు. ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి కి త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని విజ్ఞప్తి చేశారని, షర్మిల ఇందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు కోఆర్డినేటర్ కాశీం వలి, పత్తికొండ కోఆర్డినేటర్ బి. క్రాంతి నాయుడు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ నాయుడు, కర్నూలు 11వ వార్డు ఇన్‌చార్జ్ ఎం. సుంకన్న తదితరులు పాల్గొన్నారు.
