ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్‌లో… పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగుల తేడాతో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది పంజాబ్ జట్టు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 243 పరుగులు భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (47), కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ (97 నాటౌట్), శశాంక్ సింగ్ (44 నాటౌట్) వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ తో ఊచకోత కోశారు.
అనంతరం 244 పరుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన గుజరాత్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు సాధించి 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ సాయి సుదర్శన్ (74) – వన్ డౌన్ లో వచ్చిన జాస్ బట్లర్ (54) అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు.
కెప్టెన్ గిల్ (33), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (46) పరుగులతో రాణించారు. అయితే, గుజరాత్ బ్యాటర్లు పోరాడినప్పటికీ.. విజయతీరాలకు చేరలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్ తలా ఒక వికెట్ తీశారు.
పాయింట్స్ టేబుల్ ఇలా !
ఇక సీజన్లోని అన్నీ జట్లూ ఒక్కే మ్యాచ్ ఆడగా… సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు రెండేసి పాయింట్లతో టాప్ 5లో నిలిచాయి. ఇక లక్నో, ముంబై, గుజరాత్, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు పాయింట్ల పట్టికలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి.
కాగా, రేపు రాజస్థాన్ రాయల్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు గౌహతి వేదికగా తలపడనున్నాయి.