వెలగపూడి – కుటుంబాలకే కాదు, ఎదుగుతున్న దేశానికి కూడా మహిళలు వెన్నెముక వంటి వారని పవన్ కల్యాణ్ అభివర్ణించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె గొప్పదనాన్ని గుర్తిద్దాం… ఆమెకు మద్దతుగా నిలబడదాం, ఆమె కలలకు చేయూతనిద్దాం… మన చర్యల ద్వారా ఆమెకు నిజమైన గౌరవాన్ని అందిద్దాం అని పిలుపునిచ్చారు. మరింత మెరుగైన ప్రపంచాన్ని మనకు అందిస్తున్నందుకు మహిళను గౌరవిద్దాం… మరింత ఎత్తుకు తీసుకెళదాం… ఇవాళ ఒక్కరోజే కాదు… ప్రతి రోజూ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
స్త్రీమూర్తుల శక్తి అపారం -నారాలోకేష్

సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్ . మహిళా శక్తి అపారం. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారు అని ట్విట్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నాం. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తమతమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.
స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం: బాలకృష్ణ
యత్రనార్యస్తు పూజ్యంతే… రమంతే తత్ర దేవతాః అని మన సంస్కృతి మనకు చెబుతుందని… ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని దీని అర్థం అని నందమూరి బాలకృష్ణ తన శుభాకాంక్షలలో వివరించారు. స్త్రీ స్వభావమే ఆది మాతృత్వం అని అభివర్ణించారు. కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి, భవిష్యత్ పల్లవించే ప్రేమ మహిళల గొప్పదనం అని పేర్కొన్నారు.
“మహిళలు అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా ప్రతి రూపంలోనూ త్యాగానికి, ఓర్పుకు, ప్రేమకు మారుపేరుగా నిలుస్తారు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే ప్రతి మహిళా స్ఫూర్తిదాయకమే. వారిని గౌరవించుకోవడం మన విధి… వారిని కాపాడుకోవడం మన బాధ్యత. ఆదరణ, అంకితభావం, అజేయ సంకల్పం గల మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ బాలకృష్ణ సోషల్ మీడియాలో స్పందించారు.