వైభవంగా ఆది దంపతుల గిరి ప్రదక్షణ..

వైభవంగా ఆది దంపతుల గిరి ప్రదక్షణ..

  • ఇంద్రకీలాద్రి వీధుల్లో విహరించిన స్వామి వారు అమ్మవారు..
  • చైత్ర పౌర్ణమి గిరి ప్రదక్షిణకు భక్తుల రద్దీ.
  • మారుమోగిన ‘జై దుర్గ’ నినాదాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చైత్రమాస శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో వైభవంగా సాగింది. గురువారం తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఉదయం 5:55 గంటలకు ఆలయ కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. పల్లకి పై కొలువుదీరిన అమ్మవారు, స్వామివార్ల ఉత్సవ మూర్తుల వెంట భక్తులు భక్తిశ్రద్ధలతో కాలినడకన ముందుకు సాగారు. ‘జై దుర్గ.. జై జై దుర్గ’ నినాదాలతో ఇంద్రకీలాద్రి పరిసరాలు మారుమోగాయి.

కామధేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదక్షిణ కుమ్మరిపాలెం, సీతారాం జంక్షన్, చిట్టినగర్ మీదుగా ఘాట్ రోడ్డులోని అమ్మవారి వద్ద ముగిసింది. మార్గమధ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైదిక కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్, అర్చక బృందం, ఉత్సవ విభాగం సూపరింటెండెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తజనం మధ్య కార్యక్రమం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగింది. చైత్ర పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే.. పాపాలు తొలగి శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఏడాది ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది.

Leave a Reply