ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు
- పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గద్వాల నియోజకవర్గంలోని శ్రీరాముల దేవాలయాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

మల్దకల్ మండలం పరిధిలోని కుర్తిరావులచెరువు, తాటికుంటి గ్రామాల్లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగగా పేర్కొన్నారు. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించారని, ఆ మహనీయుని జన్మదినాన్ని ప్రజలు పండుగగా జరుపుకుంటారని చెప్పారు.
శ్రీరాముడు సత్యవంతుడు, ధర్మపరుడు, తండ్రి మాటకు కట్టుబడి జీవించిన ఆదర్శ పురుషుడని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమిని జరుపుకుంటారని, దేశవ్యాప్తంగా వివిధ ఆచారాలతో ఈ పండుగను నిర్వహిస్తారని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. సీతారాములు లోకానికి ఆదర్శ దంపతులని, వారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, సర్పంచ్ భగవంతు, నాయకులు మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మైలగడ్డ చంద్రశేఖర్, నరసింహారెడ్డి, ఆంజనేయులు, భాస్కర్ గౌడ్, మహబూబ్ ఆలీ, మధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
