వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా గ్లకోమా అవగాహన ర్యాలీ

నిజామాబాద్, స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా డా. నవీన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్లకోమా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ కంటి వ్యాధుల నిపుణులు, ముత్యబిందు, రెటినా శస్త్రచికిత్స వైద్యుడు డా. నవీన్ నూకల పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. నవీన్ నూకల మాట్లాడుతూ 40 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలని సూచించారు.

గ్లకోమా అనేది నిశ్శబ్దంగా చూపును దెబ్బతీసే ప్రమాదకరమైన వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధిని గుర్తించడానికి అవసరమైన ఆధునిక పరికరాలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అత్యాధునిక కంటి వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, మంచి నాణ్యతతో నిజామాబాద్‌లోనే అందిస్తున్నామని, చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ ఆప్టోమెట్రిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోజ్ మాట్లాడుతూ.. గ్లకోమా వంటి కంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన చాలా అవసరమని అన్నారు. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన వారు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా గ్లకోమా వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఆప్టోమెట్రిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply