Gas Agency | ఇంద్రకీలాద్రికి గ్యాస్ కొరత లేదు…

Gas Agency | ఇంద్రకీలాద్రికి గ్యాస్ కొరత లేదు…
అసత్య ప్రచారాలతో భక్తుల్లో అపోహలు
ప్రసాదాల తయారీ, అన్నదానం యథావిధిగా అందుతున్న గ్యాస్..
దుర్గగుడి ఈవో శీనా నాయక్
Gas Agency | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శీనా నాయక్ స్పష్టం చేశారు. దేవస్థానానికి గ్యాస్ కొరత లేదని, గ్యాస్ ఏజెన్సీల నుంచి అవసరమైనన్ని సిలిండర్లు నిరంతరంగా సరఫరా అవుతున్నాయని ఆయన తెలిపారు.
ఇటీవల కొన్ని వర్గాల్లో గ్యాస్ కొరత కారణంగా ఆలయ వంటశాలలు, ప్రసాదాల తయారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శీనా నాయక్ మాట్లాడుతూ, భక్తుల్లో అనవసర ఆందోళన కలిగించేలా జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. దేవస్థానం అవసరాలకు అనుగుణంగా గ్యాస్ ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సిలిండర్లను సరఫరా చేస్తున్నాయని ఈఓ తెలిపారు. ఆలయ వంటశాలల్లో వినియోగానికి సరిపడా గ్యాస్ అందుబాటులో ఉందని, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని పేర్కొన్నారు.

అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల తయారీతో పాటు భక్తులకు అందించే లడ్డూ, పులిహోర తదితర ప్రసాదాల తయారీ యథావిధిగా కొనసాగుతోందని చెప్పారు. రోజూ వేలాది మంది భక్తులకు అందించే నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోందని వివరించారు. రాబోయే పండుగలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ముందుగానే తగినన్ని గ్యాస్ సిలిండర్ల నిల్వలను సిద్ధం చేసుకుందని ఈఓ శీనా నాయక్ వెల్లడించారు. భక్తులకు సేవలందించడంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను భక్తులు, ప్రజలు నమ్మవద్దని ఈఓ శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆలయ సేవలు, ప్రసాదాల తయారీ, అన్నదాన కార్యక్రమాలు అన్ని యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. భక్తులు ఎలాంటి సందేహాలు లేకుండా అమ్మవారి దర్శనానికి రావచ్చని తెలిపారు.
