చీకటి వాకిట స్మశాన వాటిక…

చీకటి వాకిట స్మశాన వాటిక…
అంధకారంలో అంత్యక్రియలు…
కరెంట్ సరఫరాలో అంతరాయం…
గ్రామ పంచాయితీ నిర్లక్ష్యం…
వెల్గటూర్ ఫిబ్రవరి 19:(ప్రభ న్యూస్) : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో మార్కెట్ యాడ్ సమీపంలోని స్మశానవాటిక సమస్యల వలయంలో చిక్కుకున్నది.రాష్ట్ర ప్రభుత్వం మారాక ఆ స్మశాన వాటికలో కరెంట్ లేక నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి.స్థానిక గ్రామ పంచాయితీ స్మశాన వాటికను పట్టించుకోవడం మానేసింది దీంతో రాత్రి వేళల్లో దహన సంస్కారాలు చేయాల్సి వస్తే సెల్ ఫోన్ల వెలుతురు లేదా టార్చి లైట్లు, లేదా కారు లైట్లను ఉపయోగించాల్సి వస్తున్నదని స్థానికులు వాపోతున్నారు.
గత రెండు రోజుల క్రితం మండల కేంద్రంలోని శ్రీ రామ భక్తా ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా స్మశాన వాటికకు తీసుకుపోయిన బంధువులు నిశీధిలో సెల్ ఫోన్ లైట్లు,కారు లైట్ల సాయంతో అష్ట కష్టాలు పడుతూ దహన సంస్కారాలు పూర్తి చేశారు. ప్రభుత్వాలు, నాయకులు మారినా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితుల మాత్రం మారడం లేదు. మౌలిక సదుపాయాల కొరత, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా స్థానిక సమస్యలు అలాగే ఉండిపోవడం దీనికి నిదర్శనం అని చెప్పకనే చెప్పొచ్చు.
అభివృద్ధి పథకాలు కాగితాలకే పరిమితి కావడం సమస్యలపై పాలకుల చిత్తశుద్ధి లేకపోవడం వంటివే దీనికి కారణమనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వాలు వచ్చినా పాత సమస్యలు నీరు, రోడ్లు, ఉపాధి అలాగే ఉంటున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిధులు గ్రామాలకు సక్రమంగా అందకపోవడం స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారుల తీరు మారకపోవడం వీటికి నిదర్శనమని గ్రామస్తులు అంటున్నారు. ఇకనైనా స్మశాన వాటికలో గ్రామ పంచాయితీ అధికారులు, ప్రజాప్రతినిధులు సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
