ఫలించిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కృషి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapally) జిల్లాలోని భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు (Parliament Member) డాక్టర్ కడియం కావ్య పలు మార్లు కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ని కలసి కోరారు. భూపాలపల్లి పట్టణంలో ప్రధానంగా భారీ ట్రాఫిక్, బొగ్గు రవాణా, పవర్ ప్లాంట్ యాక్టివిటీల వల్ల ఎన్ఎచ్-353సి మీద తీవ్ర వాహన రద్దీ పెరగడంతో పట్టణమధ్యలో ప్రమాదాలు పెరిగిపోతున్నాయని ఎంపీ కేంద్రమంత్రికి వివరించారు.
గత మూడు సంవత్సరాల్లో 576 రోడ్డుప్రమాదాలు జరగడంతో దాదాపు 233 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడానికి భూపాలపల్లి పట్టణాన్ని(Bhupalapally town) దాటి వెళ్లే ప్రత్యేక బైపాస్ రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని కేంద్ర మంత్రిని ఎంపీ కోరారు. రూ.250 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బైపాస్ రోడ్డులో, రూ.175 కోట్లు నిర్మాణ పనులకు, రూ.75 కోట్లు భూసేకరణకు వినియోగించాలని ఈ నిధులను 2025- 2026 వార్షిక ప్రణాళికలో చేర్చాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు స్పందించిన కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఈ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు ఇస్తామని తెలియజేసారు. అందుకు సంబంధించిన డీపీఆర్ ను తయారు చేసి టెండర్ పనులు పూర్తి చేస్తామని వివరణాత్మక లేఖ ద్వారా కేంద్ర మంత్రి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యకు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… భూపాలపల్లి పట్టణ ప్రజల ఎన్నో ఏళ్ళ సమస్య తీరనుందన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య, ప్రజల భద్రతో పాటు ప్రయాణదూరంలో లాభం కలుగుతుందని వరంగల్ ఎంపీ (Warangal MP) డా.కడియం కావ్య ఆశాభావం వ్యక్తం చేశారు.