దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త దిశ

దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణంతో కొత్త దిశ
దివ్యాంగుల ఆత్మవిశ్వాసానికి ఊతం
సమాన అవకాశాల దిశగా కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ పట్టణంలో దివ్యాంగ శక్తి కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా జరిగింది. సమాజ ప్రగతికి సమాన అవకాశాలే పునాది అన్న సంకల్పంతో దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి నందిగామ కొత్త బస్టాండ్ నుంచి కంచికచర్ల బస్టాండ్ వరకు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న దివ్యాంగులతో కలిసి చేసిన ఈ ప్రయాణం వారికి మరింత ఉత్సాహం నింపింది.

ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, దివ్యాంగుల సామర్థ్యాలను గుర్తించి వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వారి రోజువారీ జీవితం సులభతరం కావడంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగుల పట్ల సమాజంలో అవగాహన పెంపొందించడంతో పాటు, వారికి మరింత గౌరవం కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.

