హోంగార్డు ప్రియాంకకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ మద్దతు
- పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ ) : పెనుకొండ (Penukonda) నియోజకవర్గం గోరంట్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పనిచేస్తున్న సుగాలి ప్రియాంకను మరో సుగాలి ప్రీతిగా మార్చకండి అంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న సుగాలి ప్రియాంక తనను ఇరువురు డ్రైవర్లు లైంగికంగా వేధిస్తూ వస్తున్నారని ఆరోపిస్తూ, డ్రైవర్ల మాటలు విని’ సీఐ శేఖర్ సైతం తనను ఉన్నపలంగా పోలీస్ క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయాలని ఆదేశించడంతో తీవ్ర ఆవేదన కలిగించిందని ప్రియాంక చెబుతూ తనకు ఇక బతకాలని లేదని అంటూ గోరంట్ల పట్టడానికి దూరంగా వెళ్లి సూపర్ వాష్మోల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి బాధితురాలు ఒక సెల్ఫీ వీడియోస్ అయితే సోషల్ మీడియాకు పంపింది.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ (Ushasree Charan) ఆధ్వర్యంలో సోమవారం గోరంట్ల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు పోలీస్ స్టేషన్లో పనిచేసే మహిళ హోంగార్డుపట్లనే పోలీసులు ఇంతటి దారుణంగా ప్రవర్తిస్తుంటే ఇక బయట వ్యక్తులకు ఏ మేరకు న్యాయం చేస్తారని ఆమె ప్రశ్నించారు.
బంజారా సామాజిక వర్గానికి చెందిన మహిళ హోంగార్డు ప్రియాంక (Home Guard Priyanka) కు తగిన న్యాయం చేసే వరకు ఈ ఆందోళన విరమించేది లేదని అవసరమైతే జిల్లా స్థాయిలో ఆందోళన చేపట్టి సదరు బాధితురాలికి న్యాయం జరిగే విధంగా పోరాడుతామన్నారు. తక్షణం జిల్లా ఎస్పీ స్పందించి ప్రియాంకకు న్యాయం చేకూర్చాలని ఆమె డిమాండ్ చేశారు. దయచేసి సుగాలి ప్రియాంకను మరో సుగాలి ప్రీతిగా మార్చవద్దని ఉషశ్రీ అన్నారు. ధర్నాకు మద్దతుగా పలువురు వైకాపాక్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేశారు.


