తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మాతలు వారే!

తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మాతలు వారే!
కూటమి ప్రభుత్వంలో వెంకన్నకూ డ్యామేజీ
రెండేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు బాధిస్తున్నాయి
ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తిరుపతి లడ్డూపై కూటమి ప్రభుత్వం వెంకన్న స్వామిని డ్యామేజ్ చేసిందని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇటీవల టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. జోగి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత, హీరో, విలన్, కమిడియన్లు అంతా కూటమి వారేనని, అందుకే శాసన మండలిలో చర్చ జరగనివ్వడం లేదన్నారు.
రెండేళ్ల నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందన్నారు. మాజీ మంత్రి జోగి ఇంటిపై కేవలం ఒక 30 మందితో పూర్తి ప్రణాళికతో పోలీసులే ఎస్కార్ట్ ఇచ్చి దాడి చేయించినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోందన్నారు. పసుపు రంగు రోప్ తో పోలీసుల సమక్షంలో దాడి దేనికి సంకేతం అని ప్రశ్నించారు. ఇంటిపై బాంబులు, యాసిడ్ తో దాడులు చేయడం ఎక్కడా చూడలేదన్నారు. అంబటిపై కూడా ఇలాగే దాడికి పాల్పడ్డారని చెప్పారు. టీడీపీలో మహిళలు అసభ్యకరంగా మాట్లాడటం, నేరుగా దాడుల్లో పాల్గొనడం, కొత్త సాంప్రదాయానికి తెర లేపారని, ఇదేనా మన సంస్కృతి, సంప్రదాయం అని ప్రశ్నించారు.
కక్షపూరితంగా వరుస కేసులు పెట్టడమే కాకుండా ఆధారాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలతో వివిధ రాజకీయ పార్టీలకు మీరు ఏం నేర్పుతున్నారని ప్రశ్నించారు. ఏదీ శాశ్వతం కాదని, మంచి చేస్తే గుర్తు పెట్టుకుంటారని, ఇలా దాడులు, అక్రమ కేసులు వారికే నష్టమన్నారు. కృతజ్ఞతకు, ఆశకు పోటీ పెడితే ఆశే గెలుస్తుందన్నారు. ప్రజలకు ఆశచూపి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు కేటాయింపులు లేకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు వ్యవహారంపై ఆధారం లేకుండా మాట్లాడటం వైసీపీ నేతలకు అలవాటు లేదన్నారు. ఆధారం లేకుండా మాట్లాడితే జగన్ ఉపేక్షించరన్నారు. చంద్రబాబు అనుభవం మంచి పరిపాలనకు వినియోగించాలని సూచించారు. పద్ధతులు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
