Former Minister | కూటమి నేతల మాటల్లోనే కల్తీ ఉంది..

Former Minister | కూటమి నేతల మాటల్లోనే కల్తీ ఉంది..

  • మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ విమర్శ

Former Minister | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అంబటి కుటుంబంపై జరిగిన దాడి అమానుషమని మండిపడ్డారు. ఇంట్లో మహిళలు ఉన్నారన్న కనీస ఆలోచన లేకుండా దాడులకు దిగడం దారుణమని, బీహార్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.

మహిళ ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడం దురదృష్టకరమని, కూటమి ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. దాడులతో ఏమి సాధించాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించిన ఉషశ్రీ చరణ్, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్లీన్ చిట్ రావడంతోనే డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారని అన్నారు. లడ్డులో జంతువుల కొవ్వు లేదని తేలిందని, అయితే హెరిటేజ్ పెరుగులో కల్తీ జరిగిందని నివేదికలు వచ్చిన విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వెంకన్నతో పెట్టుకుంటే ఖర్మ రిటర్న్ తప్పదని హెచ్చరించారు.

శ్రీశైలం లడ్డూ విషయంలో కూడా ఆరోపణలు చేసి, శివస్వాములపై లాఠీఛార్జ్ చేయడం అన్యాయమన్నారు. రాజకీయాలు చేయాలంటే అభివృద్ధి, రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై చర్చకు రావాలని సవాల్ విసిరిన ఆమె, కూటమి నేతల మాటల్లోనే కల్తీ ఉందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. లడ్డు కల్తీ ఆరోపణల్లో నిజం లేకపోవడంతోనే బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారని అన్నారు.

Leave a Reply