మహిళల అభివృద్ధి కోసం..

మహిళల అభివృద్ధి కోసం..

తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళల సేవలను గుర్తిస్తూ ఏర్పాటు చేసిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తమ సేవలను గుర్తించి ఇంత ఘనంగా సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి మద్దతు అందిస్తున్నందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన పట్టణ టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ జయసింహా మహిళలు కుటుంబానికి, సమాజానికి వెన్నెముక వంటివారని అన్నారు. మహిళల ప్రాముఖ్యత ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత రంగాల్లో అపారమని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ఆస్థి హక్కులు కల్పించడం, డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని గుర్తుచేశారు.

పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు బొమ్మసాని మహేష్ మాట్లాడుతూ.. మహిళలు విద్య, ఆరోగ్యం, హక్కులు, నాయకత్వంలో సాధికారత సాధించినప్పుడు సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నేటి సమాజంలో మహిళలు కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలను సమర్థంగా నిర్వహిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలులుగా రాణిస్తున్నారని అన్నారు.

పట్టణ టీడీపీ మాజీ ప్రధాన కార్యదర్శి హనుమంతు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనేక ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో మహిళలు ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని అన్నారు. తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఆకుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహిళల పాత్ర సమాజ నిర్మాణంలో కీలకమని అన్నారు. మహిళల కృషి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు.

ప్రముఖ న్యాయవాది రాజవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తున్నారని తెలిపారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నత పదవుల్లోనూ రాణిస్తున్న మహిళల కృషి సమాజ అభివృద్ధికి దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply