HIV | ఎయిడ్స్ రహిత సమాజం కోసం..
HIV | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ప్రజలందరూ ఎయిడ్స్ పై అవగాహన పెంచుకుని ఎయిడ్స్ (Aids) రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని శ్రీ సత్య సాయి జిల్లాను ఎయిడ్స్ రహితంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం ఉదయం పుట్టపర్తిలోని స్థానిక సత్యమ్మ గుడి నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… హెచ్ఐవి (HIV) వైరస్ సోకడం ఒక వ్యాధి మాత్రమే. రోగిపై వివక్ష చూపకూడదన్నారు. సురక్షిత జీవన విధానాలు పాటించడం, రక్తాన్ని తీసుకునే ముందు తప్పనిసరిగా పరీక్షించుకోవడం.. ప్రతి యువకుడు, ప్రతి కుటుంబం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత అని చెప్పారు. హెచ్ఐవి/ ఎయిడ్స్ పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నాయని..యువతలో అవగాహన పెంపు కోసం పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిడ్స్ నివారణకు ‘సమయానికి పరీక్ష – సమయానికి చికిత్స – సురక్షిత జీవనశైలి’నే ఆయుధమని ర్యాలీ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.

