మెనూ పాటించండి

  • శుభ్రత తప్పని సరి
  • అన్నా క్యాంటీన్‌లో బాపట్ల కలెక్టర్ తనిఖీ

బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. భోజనం కోసం వచ్చిన సామాన్య ప్రజలతో పాటు నిలుచుని, జేబులో నుండి ఐదు రూపాయలు చెల్లించి క్యాంటీన్‌(Canteen)లో భోజనం అందుకున్నారు. ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్‌ లోపల, బయట, చుట్టుపక్కల పారిశుధ్యం తనిఖీ చేయాలనుకున్న జిల్లా కలెక్టర్, ఆకస్మికంగా క్యాంటీన్‌కు వెళ్ళారు. భోజనంకు వచ్చిన వారితో పాటు భోజనం చేస్తూ అన్నా కాంటీన్ లో ఆహార నాణ్యత తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ప్రతిరోజు పేదలకు అల్ఫాహారం(breakfast) అందిస్తున్నారు. అయితే ఈ రోజు బాపట్ల జిల్లా(Bapatla District)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సూర్యలంక రోడ్డులోని అన్న క్యాంటీన్‌కు కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అల్పాహారం కోసం క్యాంటీన్‌కు వ‌చ్చిన వారితో మాట్లాడి క్యాంటీన్ స‌మ‌యానికి తెరుస్తున్నారా?, ఆహార ప‌దార్థాల నాణ్యత ఎలా ఉంది?. ఏమైనా ఫిర్యాదులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ఆహార ప‌ట్టిక‌, టోకెన్ కౌంట‌ర్‌, ఆహార ప‌దార్థాల‌ను వ‌డ్డిస్తున్న స్థ‌లం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లను ఆయన ప‌రిశీలించారు. అన్న క్యాంటీన్ ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉండాల‌ని, అప‌రిశుభ్రత అనేది మ‌చ్చుకైనా క‌నిపించ‌కూడ‌ద‌ని క‌లెక్టర్ వినోద్ కుమార్(Collector Vinod Kumar) ఆదేశించారు. మెనూ ప్రకారం ఆహార ప‌దార్థాల‌ను అందుబాటులో ఉంచాల‌ని సూచించారు. ఆక‌లితో ఉన్నవారికి ప‌ట్టెడ‌న్నం పెట్టడంలో ఉన్న ఆనందం మ‌రెక్కడా ల‌భించ‌ద‌న్నారు. ప్రతి క్యాంటీన్‌లోనూ అవ‌స‌ర‌మైన అన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పించాలని, క్యాంటీన్ ఆవరణలో షెడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంటీన్ల నిర్వహ‌ణ‌కు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జ్‌ల(In-charge)కు బాధ్యత‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింద‌ని క‌లెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వహకుడు శీలం శ్రీనివాసరావు, మున్సిపల్ ఇంజనీరింగ్ డి ఈ కృష్ణారెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణ, పురపాలక సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply