TG |వారితో టాయిలెట్లు క‌డిగించ‌డం కుల వివక్షే.. ఎమ్మెల్సీ క‌విత‌

  • మీ పిల్ల‌లు చ‌దువుకునే చోట ఇలానే క్లీన్ చేయ‌గ‌ల‌రా?
  • ఐఏఎస్ అధికారి అలుగు వ‌ర్షిణిని ప్ర‌శ్నించిన క‌విత‌
  • త‌క్ష‌ణ‌మే విద్యార్థుల‌తో ప‌నులు చేయించ‌డం ఆపాలి


హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : విద్యార్థుల‌తో టాయిలెట్లు క‌డిగించ‌డం కుల వివక్ష‌, శ్ర‌మ దోపిడీ అవుతుంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అన్నారు. బోర్డు తుడవడం.. టాయిలెట్ కడగడం.. ఇలాంటివి మీ పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను విద్యార్థులు క్లీన్ చేయగలరా ? అని ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణిని కవిత ప్రశ్నించారు. ఎక్స్ వేదిక‌గా ఆమె మండిప‌డ్డారు. ఈ వివక్ష నుంచి తప్పించడానికే పిల్లలకు సాంఘీక సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేస్తే డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరుతో విద్యార్థుల చేత టాయిలెట్లు కడిగించడం స‌రికాద‌న్నారు. శ్రమను గౌరవించడం (డిగ్నిటి ఆఫ్ లేబర్ ) నేర్పడం, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేర్వేరు అని అన్నారు. గురుకుల పాఠశాలల్లో మొత్తంగా శానిటేషన్ వర్కర్స్‌ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్‌గా చేయించడం నేరమని మండిపడ్డారు.

కార్మికుల‌ను తొల‌గించిన కాంగ్రెస్‌..
గురుకుల పాఠశాల‌లో ఉన్న కార్మికుల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం తొల‌గించింద‌ని క‌విత అన్నారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెలా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవార‌ని, వీరు టాయిలెట్లు తరగతి గదులు శుభ్రం చేసేవారన్నారు. గత సంవత్సరం ఆగస్టు నుండి ఈ పద్ధతికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వ‌స్తి చెప్పింద‌న్నారు. పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల, హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా రెగ్యులర్ గా చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యా సంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్ లను తొలగించి వారు చేసే పనులను పిల్లలతో చేయించ‌డంపై మండిప‌డ్డారు.

ఎందుకు ఇలాంటి ప‌నులు చేయ‌రు అన‌డం దుర్మార్గం..
సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా ? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అనడం.. ఎందుకు ఇలాంటి పనులు చేయరు.. చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గ‌మ‌ని క‌విత మండిప‌డ్డారు. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘీక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేద‌ని, ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదని, కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే అని పేర్కొన్నారు. పోష్ బ్యాక్ గ్రౌండ్ పిల్ల‌లు కాకపోయినా, అందరూ ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదన్నారు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించవలసిందిగా కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, తక్షణమే ఆ అధికారిని తప్పించాల‌ని, నెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాల‌ని, పిల్లలతో పనిచేయించటం ఆపివేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply