జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గ్యాస్ శ్రీనివాసులు.
FISHERMEN | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రాథమిక మత్స్య సహకార సంఘాలు గత ఎన్నో దశాబ్దాలుగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, వాటి అభివృద్ధికి ప్రభుత్వ స్థాయిలో స్పష్టమైన ప్రణాళికలేమీ లేవని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గ్యాస్ శ్రీనివాసులు విమర్శించారు. మత్స్యకారులను ఓటు బ్యాంక్‌లా మాత్రమే ఉపయోగించుకుంటూ, వారి సంక్షేమానికి, వారికి సముచితంగా రావాల్సిన విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో అవకాశాలకు ప్రభుత్వం పూర్తిగా దూరంగా ఉంటోందని ఆయన ఆక్షేపించారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కర్నూలు పట్టణంలోని జాతీయ మత్స్యకారుల సంఘం జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించాలని కోరారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లాలో కొత్త ప్రాథమిక మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని, సొసైటీల్లో మరణించిన సభ్యులను తొలగించి నూతన సభ్యులకు అవకాశం కల్పించాలని సూచించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపల వేట ద్వారా వచ్చిన చేపలను మార్కెట్‌లోకి తీసుకువచ్చే విధానాన్ని బలోపేతం చేసేందుకు కర్నూలు పట్టణంలో ఆధునిక చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, ఆ ప్రకటన నేటివరకు అమలు కాలేదని ఆయన విమర్శించారు.
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార సభ్యులకు చెల్లించే మత్స్యకార భరోసా ప్రయోజనాలను రాయలసీమ జిల్లాలకు కూడా వర్తింపజేయాలని, ప్రతి జిల్లాలో బెస్త విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో హామీలను తక్షణమే అమలు చేయాలని శ్రీనివాసులు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బెస్త పుల్లయ్య, తెలుగు నాగరాజు, తెలుగు కన్న, వినయ్, మహిళా నాయకురాళ్లు బెస్త పావని, బెస్త మమత తదితరులు పాల్గొన్నారు.

