Fire Accident| గుల్జార్‌హౌస్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం – 10 మంది దుర్మరణం

హైదరాబాద్ :నగరంలోని మీర్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్‌ సమీపంలోని గుల్జార్‌హౌస్‌ వద్ద మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏడుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర గాయాలపాలైన వారిని ఉస్మానియా, డీఆర్డీవో, హైదర్‌గూడ్‌ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు

కాగా, సెల్లార్‌తోపాటు ఫస్ట్‌ఫ్లోర్‌లో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనిమిది ఫైర్‌ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు.

భవనంలో చిక్కుకున్న 16 మందిని కాపాడారు. వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. గాయపడినవారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. బాధితులంతా కార్మికులేనని, వారు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చారని స్థానికులు వెల్లడించారు

Leave a Reply