Fire Accident | పేలిన సిలిండర్..

- అపార్టుమెంట్‌లో ఎగసిపడిన మంటలు!
హైదరాబాద్‌లోని సోమాజిగూడలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక ఆల్ పైన్స్ (Alpine Heights) అపార్టుమెంటులోని 5వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి మంటలు వేగంగా వ్యాపించడమే కాకుండా, అపార్టుమెంటు మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది.
దీంతో భయాందోళనలకు గురైన నివాసితులు ప్రాణాలు కాపాడుకోవడానికి భవనం నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందేరే శ్రమించారు.
మంటలు చెలరేగిన ఫ్లాట్‌లో ఒక కుక్కపిల్ల చిక్కుకుపోగా, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లి దానిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
కాగా, ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని, ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయితే, సిలిండర్ పేలుడు కారణంగా ఫ్లాట్‌లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
