జనగణన–2027లో ఖచ్చితత్వమే లక్ష్యం….

జనగణన–2027లో ఖచ్చితత్వమే లక్ష్యం….

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జనగణన–2027 ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, నియమ నిబంధనల ప్రకారం కచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. గురువారం జనగణన తొలి దశలో చేపట్టనున్న గృహ జాబితా (హౌస్ లిస్టింగ్) గృహ జనగణన కార్యక్రమాల అమలుపై ఫీల్డ్ ట్రైనర్స్, సంబంధిత అధికారులకు కర్నూలులోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణలో బోధించిన ప్రతి అంశాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని, ఎటువంటి సందేహాలున్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రాధాన్యంతో సమానంగా జనగణన ప్రక్రియకు కూడా ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నారు. అధికారులు పూర్తి నిబద్ధతతో విధులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ముందుగా హౌస్ మ్యాపింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి, ప్రతి ఇంటిని ఖచ్చితంగా గుర్తించి ఎటువంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని ఆదేశించారు.

శిక్షణలో పొందిన అనుభవాన్ని ఫీల్డ్ స్థాయిలో సమర్థవంతంగా వినియోగించుకోవాలని చెప్పారు. ఫీల్డ్ ట్రైనర్స్‌గా ఉన్న ఉపాధ్యాయులు తమ పరిధిలోని ఎన్యూమరేటర్లకు సమగ్ర శిక్షణ అందించి, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణను కచ్చితంగా నిర్వహించాలని సూచించారు. నమోదైన ప్రతి వివరాన్ని పైస్థాయిలో పునఃపరిశీలించే విధానం అమల్లో ఉంటుందని,

అందువల్ల డేటా నమోదు పూర్తిగా ఖచ్చితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, సెన్సెస్ అధికారి దీపక్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply