Fee Reimbursement | పీపీపీ విధానం రద్దు చేయాలి

Fee Reimbursement | పీపీపీ విధానం రద్దు చేయాలి

  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి
  • ఏఐఎస్ఎఫ్, వైయస్సార్ స్టూడెంట్ యూనియన్, వైయస్సార్ యూత్

Fee Reimbursement | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌ స్కాలర్‌షిప్ బకాయిలు రూ.6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలని, మెడికల్ కళాశాలల్లో అమలులో ఉన్న పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, వైయస్సార్ స్టూడెంట్ యూనియన్, వైయస్సార్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు పట్టణంలోని పీసీఆర్ సర్కిల్ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వైయస్సార్ యూత్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు డీసీ మనోజ్ రెడ్డి, వైయస్సార్ స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి సద్దాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 100 రోజుల్లోనే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని, జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యలపై కనీస శ్రద్ధ కూడా చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏర్పాటైన 17 మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరించడం అన్యాయమని వారు అన్నారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య అందించే అవకాశం ఉంటుందని, ప్రైవేటీకరణ వల్ల సామాన్య కుటుంబాల విద్యార్థులకు మెడికల్ విద్య, వైద్యం దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయస్సు నిజంగా ప్రభుత్వ లక్ష్యమైతే పీపీపీ విధానాన్ని రద్దు చేసి, 17 మెడికల్ కళాశాలలను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడిపించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఉన్నత విద్య కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇన్ని విద్యారంగ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ప్రశ్నించిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న నాయకులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని, వెంటనే అలాంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, చరణ్, వసంత్, వైయస్సార్ యూత్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply