నర్సింహులపేట, ఫిబ్రవరి12(ఆంధ్రప్రభ) : రైతు భరోసా పడలేదని రెవెన్యూ కార్యాలయంలో అధికారులను నిలదీసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని జయపురం, బాస్ తండా, బక్క తండ, ముంగిమడుగు, బోడుకా తండా, కత్తులతండాకు చెందిన రైతులు తమకు ఒక ఎకరం 15గుంటలు ఉండగా 15గంటలకు మాత్రమే రైతు భరోసా పడిందని మిగతా ఒక ఎకరానికి రైతు భరోసా ఎందుకు పడలేదని..? అధికారులతో వాగ్వాదానికి దిగారు.
రైతుల మధ్య అధికారులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంటుండడంతో సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ కార్యాలయానికి చేరుకొని అధికారులతో మాట్లాడించారు. వ్యవసాయ శాఖ అధికారి వినయ్ కుమార్, తహశీల్దార్ నాగరాజు మాట్లాడుతూ… తమ వద్ద ఎలాంటి సమస్య లేదని, రైతుల ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమవుతున్నాయన్నారు. ఆందోళన చెందవద్దని రైతుల సమస్యలను లిఖిత పూర్వకంగా తమకు అందజేయాలని దానిని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. దీంతో రైతులు శాంతించి వెనిదిరిగారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు ఉన్నారు.