చౌటుప్పల్, మార్చి 12 (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట గ్రామ సమీపంలో ఉన్న వల్లభ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందు మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ రైతులు మంగళవారం రాత్రి ధర్నా నిర్వహించారు. వల్లభ పాల కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్ధాలు, కాలుష్యం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అలుషితమై పంటలు పండక, నీరు తాగలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, కంపెనీ విడుదల చేస్తున్న కాలుష్యంపై పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు తనిఖీలు నిర్వహించి పాల కంపెనీకి నోటీసులు ఇవ్వగా, కంపెనీ యాజమాన్యం నెలరోజుల్లోగా అన్ని సరి చేసుకుంటామని చెప్పి సంవత్సరం గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోలేదని, మరింత కాలుష్యాన్ని విడుదల చేస్తూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నారని వారు ఆరోపించారు.
వల్లభ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్ధాలు, కాలుష్యం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని, భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతింటున్నాయని, తక్షణమే పాల కంపెనీని మూసివేసి తమ ఆరోగ్యాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా చేశారు. వాళ్ళ కంపెనీలోకి రాత్రి వచ్చే పాల వాహనాలను, కంపెనీ నుండి బయటి ప్రాంతాలకు వెళ్లే పాల ప్యాకెట్ల వాహనాలను కూడా రైతులు అడ్డుకున్నారు. కంపెనీ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విషయం తెలుసుకున్న చౌటుప్పల్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కానీ రైతులు తాము శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామని, తమ సమస్య పరిష్కారం అయ్యేవరకు తాము చేపట్టిన ఆందోళనను కొనసాగిస్తామని రైతులు పేర్కొన్నారు. గేటు ముందు రైతులు చేపట్టిన ధర్నా అర్ధరాత్రి వరకు కొనసాగింది. పాల సరఫరా నిలిచిపోయింది. దీంతో పాల కంపెనీ యాజమాన్యం మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి తదితర ఆందోళనకారులతో ఫోన్ లో మాట్లాడి బుధవారం కంపెనీ వద్దకు వస్తానని, సమస్య పరిష్కారానికి అవసరమని చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులకు హామీ ఇచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరవింపజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తో పాటు గ్రామ మాజీ సర్పంచ్ చక్రం జంగయ్య, రైతు ప్రతినిధులు మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.