Farmer | కూటమి ప్రభుత్వం భరోసా..

Farmer | కూటమి ప్రభుత్వం భరోసా..

Farmer | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఖరీఫ్ ఉల్లి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొన్న తీవ్ర సంక్షోభాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గుర్తించి, తక్షణమే కార్యాచరణకు దిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో పర్యటించిన మంత్రి, ఉల్లి రైతులకు (Farmer) ప్రభుత్వం అందిస్తున్న మద్దతు చర్యలను విపులంగా వివరించారు. ఉల్లి ధరలు పతనమై రైతులు నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో, మార్క్‌ఫెడ్ ద్వారా భారీ స్థాయిలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. కనీస మద్దతు ధర (ఎంఎస్పి ) కింద 69,779 క్వింటాళ్లు, ధర వ్యత్యాస చెల్లింపు పథకం (పిడిపిఎస్) కింద 99,157 క్వింటాళ్లు కొనుగోలు చేసి, మొత్తం 1,68,936 క్వింటాళ్ల ఉల్లికి ప్రభుత్వం రూ.17.22 కోట్ల వ్యయం చేసినట్లు వెల్లడించారు.

Farmer

ఇది రైతులకు నష్టాలను కొంత మేర అయినా తగ్గించే కీలక అడుగుగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విధంగా, కర్నూలు, కడప (Kadapa) జిల్లాలకు చెందిన 37,752 మంది ఉల్లి రైతులకు హెక్టారుకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.128.33 కోట్ల ఆర్థిక సహాయం నేడు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు అందనున్నాయని వివరించారు. ఈ నేరుగా నగదు జమ (డిబిటి) విధానం ద్వారా రైతులకు వెంటనే లబ్ధి చేకూరుతుందని అన్నారు.

రైతులు ఇక పై మధ్యవర్తుల పై ఆధారపడకుండా, సమూహంగా మార్కెటింగ్ చేసేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పివోలు) బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఎఫ్ పి ఓ ల ద్వారా నిల్వ, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలు మెరుగుపడతాయని, దీర్ఘకాలంలో పంటలకు స్థిరమైన ధరలు లభించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన విశ్లేషించారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేసిన మంత్రి, ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాల దిశగా ప్రభుత్వం (Govt) కట్టుబడి ఉందన్నారు. ధరల అస్తవ్యస్తతను నియంత్రించడం, మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయడం, రైతుకు న్యాయం చేయడమే ప్రభుత్వ విధానమని తెలిపారు. ఖరీఫ్ ఉల్లి సంక్షోభ సమయంలో ప్రకటించిన ఈ ఆర్థిక సహాయం, కొనుగోలు చర్యలు జిల్లాలోని రైతులకు ఊరటనిచ్చే పరిణామంగా నిలవనున్నాయని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply