పత్తికొండ మార్కెట్ లో ..
కిలో రూపాయికే బేరం
టమోటా రైతన్న ధీనస్థితి
నేలపాలు చేసిన నిరసన
( కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : శరన్నవరాత్రులు తరుణంలో కూరగాయల (Vegetables)తో పాటు నిత్యావసరాల ధరలు వినియోగదారుల నెత్తిన భారం వేస్తున్నాయి. ముఖ్యంగా టమాటా (tomato) ధర పట్టణాల్లో కిలోకు రూ.25 నుండి రూ.30 వరకూ పలుకుతోంది. కానీ ఇదే టమాటా… దాని అసలైన జన్మస్థలం కర్నూలు జిల్లా (Kurnool District) పత్తికొండ (Pathikonda)లో మాత్రం కిలోకు రూపాయికి కూడా కొనేవాళ్లు లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇటీవల భారీగా దిగుబడి రావడంతో మార్కెట్లు టమాటాలతో నిండిపోయాయి. కానీ కొనుగోలుదారుల ఆసక్తి లేకపోవడం, మార్కెటింగ్ మద్దతు ధరలు లేకపోవడం, ప్రభుత్వ మద్దతు యంత్రాంగం ముందుచూపు చూపకపోవడంతో రైతులు తమ పంటను మార్కెట్లో విక్రయించలేకపోతున్నారు. ఫలితంగా, వ్యాపారుల తక్కువ ధరకు కొనుగోలు చేయాలన్న అగ్రహానికి వ్యతిరేకంగా రైతులు తిరగబడుతున్నారు.

పంటను పారబోసి నిరసన… కర్నూలులో ఉద్రిక్తత
కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో గత రెండు మూడు రోజులుగా రైతులు తమ దిగుబడి టమాటాలను పారబోసి నిరసన తెలుపుతున్నారు. పంట పండితే ప్రశంసలు, కానీ అమ్మలేకపోతే బాధలు, అంటూ ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మరికొందరు రైతులు మార్కెట్‌కు టమాటా తీసుకురాగానే వ్యాపారులు కిలోకు రూ.50 పైసలు ధర మాత్రమే సూచించడంతో కళ్లారా కష్టపడిన పంటను రోడ్డుపై పారేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కొంతమంది రైతులు ఖర్చులు మించిన నష్టాలను తట్టుకోలేక, బస్తాల బస్తాల టమాటాలను రవాణా ఖర్చులు లేకపోవడంతో గడ్డి మేడల్లో, రోడ్డుదారుల పక్కన వదిలేసి వెనక్కు తిరుగుతున్నారు. మార్కెట్ యార్డులో టన్నుల కొద్ది పండిన టమాటా వృథాగా పోతుండటమే కాక, వాసనలతో దుర్వాసనలు వ్యాపించాయి. ప్రజారోగ్యాన్ని కూడా ఇది ప్రభావితం చేసే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా రాష్ట్రంలో టమోటా ధరలు ఆకాశానికెగుస్తుంటే… కర్నూలులో మాత్రం రూపాయికీ దొరుకుతుందేంటి? రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో టమాటా ధర రూ.25 నుంచి రూ.30 మధ్య ఉంటోంది. కానీ అదే పంట ఎక్కువగా పండే కర్నూలు జిల్లాలో మాత్రం ధర కిలోకు రూపాయిని కూడా తాకడం లేదు. రూపాయి ఇస్తామంటే రైతులు సంతోషంతో ఎగబడుతున్న పరిస్థితి. ఇది వ్యవసాయ రంగంలో గడ్డు పరిస్థితిని ఆవిష్కరిస్తోంది. ఒకవైపు వినియోగదారులు అధిక ధరలు చెల్లిస్తున్నా, మరొకవైపు రైతులు కనీస రవాణా ఖర్చులు కూడా తీరించలేక ఆవేదన చెందుతున్నారు.
రైతన్నకు దిక్కేదీ ?
ఆరుగాలం పొలాల్లో చెమట చిందించిన రైతుకు కనీస భద్రతా ధరలు లేకపోవడం వల్ల పెట్టుబడులు తిరిగి రావడమే కాదు, అప్పుల్లో మునిగిపోతున్నారు. సేంద్రియ ఎరువులు, బీటీ విత్తనాలు, మందుల ఖర్చులు, వృత్తిరీతి ఆధారంగా తీసుకున్న అప్పులు అన్నీ కలిపితే ఒక్కొక్క రైతు లక్షల్లో ఖర్చు చేస్తున్నాడు. కానీ దిగుబడి వచ్చిన తర్వాత కొనుగోలు ధరకే ఆ పంటకు విలువ లేకపోవడంతో శ్రమకు న్యాయం లేకుండా పోతోంది.
స్థిర ధరలపై స్పందన ఏది
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. మార్కెటింగ్ శాఖ దృష్టి సారించకపోవడంతో పంటల ధరల స్థిరీకరణ అన్నదే సాధ్యపడడం లేదు. ముఖ్యంగా టమోటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించకపోతే, వ్యవసాయ రంగం నెమ్మదిగా పతన దిశగా సాగిపోతుందని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.