విజయవాడలో ఎగ్జిబిషన్ సందడి

విజయవాడలో ఎగ్జిబిషన్ సందడి

పుష్కర కాలం తర్వాత బెజవాడలో ఆనందోత్సాహం
600 స్టాళ్లల్లో జనం పరవశం
ఇక వ్యవసాయ–పారిశ్రామిక ప్రదర్శనలు సరే సరి
జెయింట్ వీల్స్, రైడ్స్ వద్ద చిన్నారుల కేరింతలు
ఫుడ్ కోర్టుల్లో రుచుల విందు
ప్రతిరోజూ ప్రముఖ గాయకుల గానకచేరీలు
కనకదుర్గమ్మ దర్శనం అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భక్తుల రద్దీ
రోజుకు 2 లక్షల వరకూ వ్యాపారం చేస్తున్న స్టాళ్లు
ప్రజలకు వినోదం – వ్యాపారులకు లాభం

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : కోటి దండల విద్యుల్లతల జిలుగులు.. పున్నమి వెన్నెలను మరిపించి.. వెలుగు పూల వాన కురిపించే కరెంటు లైట్ల శోభ.. ఇక రంగుల రాట్నాల్లో గిరిగిర తిరిగే చిన్నారుల చిరు నవ్వులు.. భారీ జాయింట్ వీల్ పై కెవ్వు కేకలు.., చిల్లి చిట్టి గారె, నాటు కోడి పులుసు.. హైదారాబాదీ బిర్యానీ మాషాళా.. అంతే కాదు.. వావ్ ముంత కింద పప్పే కాదు.. జిహ్వలూరించే ఎన్నో మధురిమల ఫుడ్ కోర్టు. అంతేనా .. ఇక డ్యాన్స్.. డ్యాన్స్ మ్యూజిక్స్.. వీటికి తోడు జ్ఞాపకాల సేకరణకు జనం కిక్కిరిసిన 600 స్టాల్స్.. అబ్బో.. మళ్లీ ఆ రోజులు గుర్తుకు రావటమే కాదు.. సజీవ దృశ్యం ఆవిష్కృతం కావటంతో.. బెజవాడ (Bejwada) ప్రజల ఆనందానికి అవధిలేదు. ఒకటా రెండా 12 ఏళ్లు పుష్కరకాలం వినోదానికి దూరమయ్యారు.

విజయవాడ ఉత్సవ్ (Vijayawada Utsav) పుణ్యమా.. ఇప్పుడు బెజవాడ ప్రజలకే కాదు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన దుర్గామాత (Durga Mata) అశేష భక్తులు ఈ ఎగ్జిబిషన్ (Exhibition) సన్నిధిలో సందడి చేస్తున్నారు. ఔను .. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా గొల్లపూడి మైదానం (Gollapudi Maidan) రంగురంగుల దీపాలతో కాంతులీనుతోంది. ఎగ్జిబిషన్ ప్రాంగణం అంతా చిన్నారులు, యువతీ యువకులు, మహిళలు ఉత్సాహ కేరింతలు, కుటుంబాల సందడి నిండిపోయింది. 12 ఏళ్ల విరామం తర్వాత విజయవాడలో ఎగ్జిబిషన్ తిరిగి ప్రారంభం కావడంతో సందర్శకులతో పాటు నగరవాసులంతా పెద్ద సంఖ్యలో ఆనందోత్సాహాలతో తరలివస్తున్నారు.

600 స్టాళ్లతో అట్టహాసం
ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఎక్కడ చూసినా స్టాళ్లు సందర్శకులతో సందడిగా కనిపిస్తున్నాయి. సుమారు 600 స్టాళ్లు ఏర్పాటు చేయడం విశేషం. ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రదర్శన రైతులను ఆకర్షిస్తే, పారిశ్రామిక ఉత్పత్తుల స్టాళ్లు వ్యాపారవేత్తల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వస్త్రాలు, ఆభరణాలు, హస్తకళలు, పుస్తకాలు, గృహోపకరణాలు ఇలా అన్నింటినీ ఒకేచోట చూసి కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది.

ఫుడ్ కోర్టుల్లో రుచుల విందు
ఎగ్జిబిషన్‌ను ఆస్వాదిస్తున్న ప్రేక్షకులకు ఒక వైపు ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టులు సందర్శకులను తమవైపు లాగుతున్నాయి. చాట్ స్టాళ్ల దగ్గర చిన్నారులు లైన్‌లో నిలబడితే, వెజిటేబుల్ రుచుల కలబోత వాసనతో యువత ఆకర్షితమవుతున్నారు. ఐస్‌క్రీమ్స్, జ్యూస్ సెంటర్లు కూడా పెద్ద ఎత్తున కస్టమర్లతో నిండిపోతున్నాయి.

జెయింట్ వీల్ కేకలు… రైడ్స్ ఉత్సాహం
మరొక వైపు జెయింట్ వీల్ పైకి ఎగిసిపోతూ కిందకు దిగుతుంటే చిన్నారుల కేకలు, యువతీ యువకుల ఉల్లాసం వినిపిస్తోంది. గాలిలో ఎగిరే రైడ్స్, రోలర్ కోస్టర్స్, డ్రాగన్ ట్రైన్లు సందర్శకులను ఉత్సాహపరుస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేక ఆటల స్టాళ్లు కూడా విపరీతంగా ఆదరణ పొందుతున్నాయి.

సాంస్కృతిక వేదికపై సందడి..
ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సాయంత్రం వేళ కాంతులీనుతున్న స్టేజ్‌పై ప్రముఖ గాయకులు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. గానకచేరీలు, నృత్య ప్రదర్శనలు, నాటికలు, మిమిక్రీ – ఒక్కొక్కటి సందర్శకులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తోంది. స్థానిక కళాకారులు, జాతీయ స్థాయి ప్రతిభావంతులు కలిసి ఈ వేదికను వినోద హరివిలాసంగా మార్చేశారు.

దసరా భక్తుల రద్దీతో కిటకిట
ప్రస్తుతం విజయవాడ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ ఆలయ దర్శనం అనంతరం వేలాది మంది భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి ఎగ్జిబిషన్‌కి వస్తున్నారు. భక్తి, వినోదం కలిసిన ఈ అనుభవం వారిని సంతోషభరితుల్ని చేస్తోంది. పలు జిల్లాలు, దేశ విదేశాల నుంచి ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున వస్తున్న అమ్మవారి భక్తులు అమ్మవారి దర్శనానంతరం ఎగ్జిబిషన్లు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వ్యాపారుల ముఖాల్లో ఆనందం…
ఎగ్జిబిషన్‌లో సందర్శకుల రద్దీతో వ్యాపారం కూడా చకచకా సాగుతోంది. నిర్వాహకుల ప్రకారం, ఒకో స్టాల్ రోజుకు ₹2 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. “చాలా కాలం తరువాత మాకు ఇంత పెద్ద అవకాశమొచ్చింది. అమ్మకాలతో చాలా సంతృప్తి” అని పలువురు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆనందోత్సాహానికి నిదర్శనం
చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఒకేలా ఎగ్జిబిషన్‌ను ఆస్వాదిస్తున్నారు. ఎగ్జిబిషన్ మైదానం ఒక మేళవింపుగా మారింది – వినోదం, సంస్కృతి, వ్యాపారం అన్నీ ఒకే వేదికపై సమ్మిళితమై విజయవాడకు కొత్త ఊపిరి నింపుతున్నాయి.

Leave a Reply