కార్యవర్గాల ఏర్పాటుకు కసరత్తు

కార్యవర్గాల ఏర్పాటుకు కసరత్తు

  • కాంగ్రెస్‌ కొత్త సారథులు
  • సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అధిష్ఠానం కసరత్తు
  • కాంగ్రెస్‌ జిల్లా కార్యవర్గాల భర్తీకి అధిష్ఠానం కసరత్తు
  • రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • కరీంనగర్‌కు రానున్న పరిశీలకులు
  • ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఉమ్మడి కరీంనగర్‌ బ్యూరో (ఆంధ్ర ప్రభ) : అధికార కాంగ్రెస్‌ లో సంస్థాగత సందడి మొదలైంది. జిల్లా కమిటీల కార్యవర్గాలను ఎంపిక చేసేందుకు టీపీసీసీ కసరత్తు ప్రారంభించింది. కొత్త సారథులతో పాటు కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు హైకమాండ్‌ పరిశీలకులను నియమించింది.

డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడే వారి నుంచి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో పార్టీ సంస్థాగత ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని అధిష్టానం భావిస్తోంది. పదేళ్ల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటంతో పార్టీ పదవులపై నాయకులు ఆశతో ఉన్నారు.

ఏఐసీసీ నియమించిన ప్రతినిధులు వారికి కేటాయించిన జిల్లాల్లో పర్యటించి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలవనున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుల మనోభావాలను కూడా తెలుసుకోనున్నారు.

పరిశీలకులు:

కరీంనగర్‌ జిల్లాకు: ఆత్రం సుగుణ, కరీంనగర్‌ కార్పొరేషన్‌ కు MP చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి
జగిత్యాల జిల్లాకు: జగ్గారెడ్డి
రామగుండం కార్పొరేషన్‌: మహమ్మద్‌ ఖాజా ఫసియోడ్డిన్‌
పెద్దపల్లి జిల్లాకు: కేతూరు వెంకటేష్‌, గిరిజ శేఖర్
రాజన్న సిరిసిల్ల జిల్లా: చిట్ల సత్యనారాయణ

వీరిని ఆయా జిల్లాల‌కు పరిశీలకులుగా అధిష్టానం నిర్ణయించింది.

వీరు సోమవారం నుంచి ఆశావహుల సమాచారం సేకరించి వారు పార్టీకి అందించిన సేవ, గత రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. 2023లో శాసనసభ ఎన్నికలు జరిగి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీసీసీలకు కొత్త అధ్యక్షులను నియమించాలనే ప్రతిపాదనలు వచ్చాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రస్తుతం నాలుగు డీసీసీల అధ్యక్షులు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరు అటు నియోజకవర్గ అభివృద్ధి.. ఇటు పార్టీ కార్యకలాపాలతో తీరిక లేకుండా ఉంటున్నారు. వీరి స్థానంలో వేరే వారిని నియమిస్తే బాగుంటుందని ఏఐసీసీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్‌ భావిస్తున్నారు.

చొప్పదండి నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర చేపట్టిన సందర్భంలో నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టగా చాలామంది కొత్తవారిని నియమించాలని విన్నవించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి చాలా మంది సీనియర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

నామినేటెడ్‌ పదవులు ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి లేదని అధ్యక్ష పదవి పై గంపెడశాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. తమకు కలిసి వస్తున్న సామాజిక వర్గ సమీకరణలతో కొందరు ఈ కుర్చీలో కూర్చోవాలని భావిస్తున్నారు. ఇంకొందరు పార్టీని కట్టుబడి ఉన్న తమ నిబద్ధతను బలంగా భావిస్తున్నారు.

ఇప్పటికే ముఖ్య నేతల వద్ద మనసులోని మాటను విని పించేశారు. కరీంనగర్‌ డీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉన్నారు. ఈ స్థానానికి సుడా చైర్మన్‌ కోమటి రెడ్డి నరేందర్రెడ్డి, పార్టీ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్రావు, డీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు పద్మాకర్‌ రెడ్డి, మహిళా కోటాలో సత్య ప్రసన్న రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

ఇందులో వెలిచాలకు ఇప్పటికే పార్లమెంట్‌ ఇంచార్జి ఉండగా , కరీంనగర్‌ అసెంబ్లీ ఇంచార్జి కోసం సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పద్మాకర్‌ రెడ్డి 20 ఏళ్లుగా పార్టీకి క్రియాశీలకంగా పని చేస్తూ పొన్నం ప్రభాకర్‌ ముఖ్య అనుచరుడిగా ముద్ర పడగా ఆయన సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఉండగా సంగీతం శ్రీనివాస్‌, చక్రధర్రెడ్డి, గడ్డం నర్సయ్య తదితరులు ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ స్థానంలో నియమించాలని మంథని నేత కాచే శశిభూషణ్‌, తిరుపతి యాదవ్‌, సదానందం, ఈర్ల కొంరయ్య, సారయ్యగౌడ్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.

జగిత్యాల జిల్లా అధ్య క్షుడిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ వ్యవహ రిస్తుండగా ఆ పీఠాన్ని అందుకోవాలని సుజిత్‌ రావు, కొమిరెడ్డి కరంచంద్‌, జువ్వాడి కృష్ణారావు తదితర నాయకులు ఆశిస్తున్నారు. అధిష్ఠానం ప్రక్రియ ప్రారంభించిన తరువాత మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Leave a Reply