Exclusive | అడుగ‌డుగునా అవే ఆన‌వాళ్లు .. అల్లూరి తొవ్వలో ఈ త‌రం జర్నీ!

తొలి స్ఫూర్తి వేదిక నర్సీపట్నం
ఐఏఎస్, ఐపీఎస్​ అధికారులకు ప్రయోగాల పాఠశాల
సీనియర్ల స్ఫూర్తితో రాణిస్తున్న ఈతరం ఆఫీస‌ర్లు
తండ్రి మాధవుడి ఆశయాన్ని కొనసాగిస్తున్న తనయ
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ఎన్జీవోల సహకారంతో పెద్ద ఎత్తున డెవలప్​మెంట్
ఐఏఎస్​ సునీత జర్నీ కూడా నర్సీపట్నం నుంచే మొదలు
పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్​ సెంటర్​ ఏర్పాటు
సమర్పన్​ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసిన ఐపీఎస్​ ఆఫీసర్​
కవి, రచయిత, అనువాదకుడిగా గుర్తింపు పొందిన సత్యనారాయణ
ఉత్తరప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో స్పెషల్​ ఆఫీసర్​గా విధులు
​ఇదే ఆశయంతో ముందడుగు వేస్తున్న మరికొందరు..

నర్సీపట్నం, ఆంధ్రప్రభ :

నర్సీపట్నంలో సివిల్స్ సర్వీసెస్ బాధ్యత తీసుకున్న ఎందరో అధికారులు.. అల్లూరి స్ఫూర్తితో సామాజిక సేవా దృక్ఫథంతో పని చేస్తున్నారు. వీరిలో తొలితరం అధికారులుగా చాలామంది ప్రత్యేక ముద్ర వేశారు. వారిని ఆదర్శంగా తీసుకున్న ఈ తరం అధికారులు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నా వారి మనసంతా నర్సీపట్నం మీదనే ఉంటుందనే విషయం స్పష్టం అవుతోంది. ఇక ఈ తరానికి సేవలందిస్తూ ప్రజలతో మన్ననలు అందుకుంటున్న వారిలో సీనియర్​ ఐఏఎస్​ అధికారి కాకి మాధవరావు కూతురు సునీతా తొలి వరుసలో ఉన్నారు. కాగా, సీనియర్లను చూసి, వారి నుంచి స్ఫూర్తిపొందిన చాలామంది తాము కూడా కలెక్టర్లం కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో ముగ్గురు తమ సత్తా చాటుకున్నారు.

తండ్రి బాటలో తనయ.. ఎన్జీవోల సాయంతో..

నర్సీపట్నం ఏజెన్సీ హీరో కాకి మాధవరావు తనయ కాకి సునీతా మాధవరావు. 1995 నుంచి 96 వరకు సబ్ కలెక్టర్‌గా ఇక్కడ పనిచేయడం విశేషం. తండ్రి స్ఫూర్తితో ఐఏఎస్ అధికారిగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేశారు. ప్రభుత్వ సహకారంతో ఎన్జీవోల సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇంతక ముందు పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, సంస్థాగత ఆర్థిక వనరుల సమీకరణ, ఆర్థిక శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా, గుంటూరు పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మహిళలు, పిల్లలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల శాఖ ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక‌.. ఆ తర్వాత క్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేసిన ఆర్.గోవిందరావు కూడా ఐఏఎస్ హోదా సాధించారు.

ఇదే స్ఫూర్తితో.. ఆ ముగ్గురూ

ఈ ప్రాంతంలో పనిచేసిన ఐఏఎస్ అధికారుల స్ఫూర్తితో నర్సీపట్నం వారసుల్లో ఎంతో మంది ఉన్నత లక్ష్యాలను సాధించారు. ప్రస్తుత యూపీ రాష్ట్రం లక్నో ఏడీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి కిల్లాడి సత్యనారాయణ ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళ భద్రత పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కేడర్‌లో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిల్లాడ సత్యనారాయణ, కొనసాగుతున్న మహా కుంభ్ 2025లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ అద్భుత ప్రయాణం నర్సీపట్నం కోరవుట్ల మండలంలోని ఒక చిన్న గ్రామంలో ప్రారంభమైంది. అక్కడ అతను ప్రారంభ విద్యాపరమైన ఒడిదుడుకులను అధిగమించి దేశానికి అత్యుత్తమ సేవ‌లు అందించే దాకా వెళ్లారు..

స‌మ‌ర్ప‌న్ స్ట‌డీ స‌ర్కిల్ ఏర్పాటు..

ఆంధ్రా యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసిన సత్యనారాయణ ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో ఉత్తరప్రదేశ్ పోలీసు శాఖలో వివిధ కీలక పాత్రల్లో పనిచేశారు. తన వృత్తిపరమైన విజయాలకు అతీతంగా, అతను సామాజిక సేవకు లోతుగా కట్టుబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వగ్రామంలో సమర్పన్ స్టడీ సర్కిల్ ను స్థాపించారు, పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్‌ సదుపాయం కల్పించారు. ప్రభుత్వంలోని ఇతర రంగాల్లో ఉపాధికి బాటలు వేశారు. విద్యపై అతని అంకితభావం అతడి గ్రామం దాటి విస్తరించింది. గ్రామీణ విద్యాజ్యోతి వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. గ్రామీణ విద్యార్థులతో మమేకమై తమ లక్ష్యాలను సాధించడానికి ప్రేరేపించారు. కవి, రచయిత, అనువాదకుడిగా సత్యనారాయణ మనలోని గొప్ప మహాసముద్రాలు సహా అనేక పుస్తకాలను రచించారు. ఇది ఆత్మపరిశీలన, స్వీయ-ఆవిష్కరణను ప్రోత్సహిస్తోంద‌ని చెబుతుంటారు.

అదే తొవ్వలో ఇంకొంద‌రు..

ఇక.. ఇటీవల కాలంలో ఆలిండియా సివిల్ సర్వీస్ పరీక్షల్లో 28వ ర్యాంకు సాధించిన మంత్రి మౌర్య భరద్వాజ్ ప్రస్తుతం ఆదోని సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. గ్రూప్-1లో డీఎస్పీగా ఎంపిక అయ్యి ఐపీఎస్‌కు పదోన్నతి పొందిన కంచి శ్రీనివాసరావు ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇట్లా.. ఎంతో మంది యువ విద్యార్థులు నర్సీపట్నంలో పనిచేసిన సీనియ‌ర్ ఆఫీస‌ర్ల‌ను, ఉద్యోగులను చూసి స్ఫూర్తిపొందారు. ఈ త‌రం వార‌సులుగా తమ లక్ష్యాలను సాధించి అల్లూరి సీతారామారాజు సేవా దృక్ఫ‌థాన్ని కొన‌సాగిస్తున్నారు. నేటి త‌రానికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *