Exclusive | చే గువేరా.. జ‌న యోగి!

ధ‌ర్మ ర‌క్ష‌కుడు ప‌వ‌ర్ స్టార్‌
విప్ల‌వ భావ‌జాలం నుంచి ఆధ్యాత్మిక‌త‌వైపు
కొత్త ఆలోచ‌న‌ల‌కు పురుడుపోసిన ప‌వ‌నిజం
అప్పుడేమో స్టార్ క్యాంపెయినర్
ఇప్పుడేమో పొలిటిక‌ల్‌ గేమ్ చేంజర్
ఫ్చూచ‌ర్‌లో డిసైడర్ రోల్ ఖాయం
ఇదే ప‌వ‌న‌న్న భవిష్యత్‌ అంటున్న జ‌నం
చిత్రాడ వేదిక‌గా జ‌న‌చేత‌న విజృంభ‌ణం
భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్న జ‌న‌సేనాని

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : ఏపీ రాజకీయాల్లో విభిన్న.. వినూత్న పవనిజం అవతరించినట్టే. పదకొండేళ్ల కిందట ప్రజారాజ్యం పార్టీని ప్రజలకు దూరం చేసిన మహా శత్రువును నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్.. ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కీలక సూత్రధారిగా అవ‌త‌రించారు. ఔను ఆ రోజున కాంగ్రెస్ పార్టీని ధ్వంసం చేయటమే అతడి ఆలోచన. జనసేన పార్టీని ప్రకటించిన రోజు.. ఆయనపక్కన సహ రాజకీయ నేత ఒక్కరూ లేరు. కానీ, ఒకే ఒక సైనికుడిగా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏపీలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీ టీడీపీ, కేంద్రంలో కాంగ్రెస్ ను మట్టికరిపించే బాధ్యతను చేపట్టిన బీజేపీ.. ఈ రెండు పార్టీలే.. ఆయనకు లభించిన అస్త్ర శ‌స్త్రాలు. పవర్ స్టార్‌గా.. క్యాంపెయిన్ స్టార్‌గా.. ఆనాడు ఎన్నికల్లో ప్రచారం చేస్తుంటే.. అందరూ లైట్ తీసుకున్నారు. దేశ ప్రజలంతా అవినీతి, అక్రమాలు, స్వార్థ రాజకీయాలకు విసిగి వేసారి కాంగ్రెస్‌ను తరిమికొట్టారే గానీ.. పవన్ కళ్యాణ్ ప్రచారం గొప్పకాదని చెప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో తన సొంత బలాన్ని నిర్ధారించుకోవటానికి ఒంటరి పోరాటానికి దిగి.. అసలు సిసలు బలాన్ని భేరీజు వేసుకున్నారు. రాజకీయ పార్టీలన్నీ జనసేనలో జనం లేరు.. సైనికులు లేరు. ఇక పవర్ స్టార్ పవనిజం అంటే ప్రచార ప్రభంజనమే గానీ ఓట్లు రాల్చని రాజకీయ పార్టీగా హేళన చేశాయి.

జనంలో.. జనం కోసం..

2019 ఎన్నికల్లో జనసేన పరాజయం తర్వాత పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ప్రత్యర్థి పార్టీలు సంబురం చేసుకున్నాయి. కానీ, ఆరు నెలల్లోనే పవన్ కల్యాణ్ తన అసలు రూపం చూపించారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారు. ఆ సమయంలోనే ఇసుక సంక్షోభంతో కూలీలకు పనులు లేక ఆత్మహత్య వంటి ఘటనలు జ‌రిగాయి. ఈ సమస్యనే ఆయుధంగా చేసుకుని పవన్ కల్యాణ్ విశాఖలో భారీ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలకు ఇప్పటి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది మొదలు జనసేనానిగా పవన్ కల్యాణ్… రైతు సంక్షేమం, మహిళల రక్షణ, భూ ఆక్రమణలు వంటి అంశాలపై ప్రశ్నిస్తూ… ప్రజల్లో కలిసిపోయారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో అంట‌కాగిన‌ పవన్ కల్యాణ్ తన రూట్ మార్చేసుకున్నారు.

ఇలా.. గేమ్ చేంజర్‌గా..

వైసీపీని పవన్ కళ్యాణ్ ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తానులో ముక్కగానే ఆ పార్టీని పవర్ స్టార్ గుర్తించారు. ఉద్యమాలు, ఆందోళనలతో ప్రజల్లోకి వెళ్లినా రాజకీయంగా ఇంకా నిలదొక్కుకోలేదనే విమర్శను ఎదుర్కొన్నారు. అప్పటికే వామపక్షాలను వీడి బీజేపీతో జతకలసిన పవన్… రాష్ట్రంలో టీడీపీకి మద్ధతు తెలుపుతున్నట్లుగా తన చర్యలు కనిపించేవి. పవన్ కల్యాణ్ కేంద్రంలో బీజేపీతో, రాష్ట్రంలో టీడీపీతో ఉంటున్నారని.. .వైసీపీ విమర్శలు చేసేది. దీన్ని పవన్ ఏనాడు ఖండించలేదు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఒక్కటేనంటూ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వైసీపీ విమర్శలు చేసేది. 2023 సెప్టెంబరులో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అప్పటి వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ సమయంలో పవన్ బహిరంగంగా స్పందించి… రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. ఇదే జనసేనకు, టీడీపీకి 2024 ఎన్నికల్లో బూస్టులా పని చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్… 2024 ఎన్నికల్లో టీడీపీతో తాను కలిసి వెళ్తున్నానని…వైసీపీ అరాచకాలను ఎదుర్కొవాలంటే తన ఒక్కడి బలం చాలద‌ని రాజమండ్రి జైలు వద్ద జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ విషయంలో బీజేపీని ఒప్పిస్తానని అన్నారు.

సౌత్ యోగిగా, ఎదుగుతూ ఒదుగుతూ..

2014 మార్చి 14వ తేదీన విడుదలైన జనసేన పార్టీ చిత్రం జూన్ 4, 2024 న సూపర్ హిట్ కొట్టింది. కూటమిలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలను గెల్చుకుని 100 పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించింది. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి… తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.

విప్ల‌వ భావ జాలం నుంచి ఆధ్యాత్మిక‌త‌వైపు..

తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉదంతంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో సనాతన ధర్మరక్షణ మేల్కొంది. ఒక విప్లవకారుడు కాస్తా.. ఆధ్యాత్మిక రక్షకుడి బాధ్యతలో లీనమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలం, బలగం కోసం తల్లడిల్లుతున్న బీజేపీ పెద్దలకు పవనిజం ఓ అస్త్రంగా మారింది. ఇప్పటికే తెలంగాణలో అధికారం కోసం శతవిధాల ప్రయత్నాలు సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓ శక్తివంత నాయకుడు అవసరమైన స్థితిలో.. దక్షిణ యోగి ఆదిత్యనాథ్‌గా బీజేపీ శ్రేణులు భావించటం విశేషం. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్.. మరో పదేళ్ల తరువాత బీజేపీ సహకారంతో సీఎం కావటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు జాతకాలు చెబుతున్నారు. ఎనీ హౌ.. చిత్రాడ స‌భ‌తో జయకేతనం ఎగురవేస్తున్న‌ పవన్ కళ్యాణ్.. జనం హోరులో తన భవిష్యవాణి వినిపిస్తార‌ని అంతా ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం అస్త్రంగా తమ ప్రభుత్వం శక్తిని వివ‌రించ‌నున్నారు. కూటమితోనే ఏపీ ప్రజల బతుకులు గాడిలో పడతాయని తెలియ‌జేయ‌నున్నారు. ఎక్కడా మిత్రబేధాన్ని ప్రకటించర‌ని, కేవలం జనం కోసం.. జనంలో.. జనంతో పని చేస్తానని హామీ ఇస్తార‌నేది ప‌రిశీల‌కులు భావ‌న‌. జన సేన అంటే.. జనం పార్టీ అని రాజకీయ పండితుల విశ్లేషణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *