Exclusive | రాహ‌ల్‌ వ్యూహం ! బలం, బలగంపైనే ఫోకస్​

పార్టీ ప్రక్షాళనే ప్ర‌ధాన ఉద్యేశం
డీసీసీ అధ్యక్షుడే చీఫ్.. ఇత‌ర లీడ‌ర్ల‌కు క‌ళ్లెం
అసెంబ్లీ టిక్కెట్లలోనూ నిర్ణయాధికారం వారికే
నేరుగా కేంద్ర కమిటీతో స‌త్సంబంధాలు
మోదీ ఇలాఖాలో పటేల్ వారసత్వంపై పోటీ
గుజ‌రాత్‌లో పాగా వేయ‌డ‌మే అస‌లు టార్గెట్‌
మేథోమ‌థ‌నంలో పెద్ద‌ల నిర్ణ‌యాలు ఇవే

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ‌

మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ రాబోయే నాలుగేళ్లల్లో వరుసగా.. 13రాష్ట్రాల్లో తన బలం, బలగాన్ని పెంచుకోవాలి. లేని ప‌క్షంలో దేశ రాజకీయాల్లోనే కాంగ్రెస్ ఉనికి కనుమరుగు కాక‌ తప్పదు. ఈ ఏడాది 2025 ఆఖరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది 2026లో అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఇక 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్ని, 2028లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోవాలి. అంతిమంగా 2029లో లోక్‌సభ ఎన్నికలు, ఒడిశా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి దెబ్బకొడితే.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఈ స్థితిలో మెదీషా ద్వయం దూకుడుకు కళ్లెం ఎలా? వేయాలనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం జరిపిన మేథోమథ‌నంలో.. కొన్ని కీలకాంశాలు దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇక‌.. రాహుల్ కీల‌క వ్యూహం ఏంట‌న్న‌ది కూడా ఈ స‌ద‌స్సులో చ‌ర్చించి, అమ‌లు చేయ‌బోతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

గుజరాత్ పీఠమే టార్గెట్
అందుకే 64 ఏళ్ల పాటు.. కనీసం పట్టించుకోని గుజరాత్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. జాతీయోద్య‌మంలో కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని గుర్తు చేసుకుంది. ఇక గుజరాత్‌లో బీజేపీ ఓటమే టార్గెట్‌గా మంత్రాంగానికి సిద్ధపడింది. గుజరాత్ పీఠం కైవసమే ప్రధాన లక్ష్యంతో ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలనే వ్యూహాత్మకంగా అడుగులు ప్రారంభించింది. తదనుగుణంగానే గుజరాత్‌ వేదికగా సీడబ్ల్యూసీ, ఏఐసీసీ విస్తృత స్థాయి భేటీలో అగ్రనేతలంతా కలిసి రోడ్ మ్యాప్ రెడీ చేశారు. నిజానికి గుజరాత్‌లో గత ముప్పై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం చిక్కటం లేదు. ఒక రకంగా బీజేపీకి గుజరాత్ పెట్టని కంచుకోటగా మారింది. ఇలాంటి స్థితిలో.. ప్రధాని మోడీ సొంతగడ్డ గుజరాత్ వేదికగా భారత జాతీయ కాంగ్రెస్ సీడబ్ల్యూసీ, ఏఐసీసీ ఆధ్వర్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులతో సహా 169 మంది పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుల్లో కీలక సర్థార్ వల్లభాయ్ పటేల్‌ వారసత్వాన్ని బీజేపీ కైవసం చేసుకుందని, మహాత్మా గాంధీ, పటేల్, నెహ్రూలకు అసలు వారసులం తామేనంటూ కాంగ్రెస్ నేతలు స్వరం విప్పారు. ఇక గుజరాత్‌ లో పుట్టిన మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్.. అసలు సిసలు కాంగ్రెస్ నేతలని.. తమ నేతల్ని రాజ్యాధికారం కోసం బీజేపీ వాడుకుంటోదనే వాదన తెరమీదకు తీసుకువచ్చింది. లోకల్ హీరో పటేల్ వారసత్వం పేరుతో.. గుజరాత్ లో బలం పెంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇంతకీ ఈ లోకల్ అస్త్రం ఎంతమేరకు పని చేస్తుందో..గానీ.. ఇక సంస్థాగత ప్రక్షాళనపై జరిగిన చర్చ.. తీసుకున్న తీర్మానాలు .. దేశంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కదిలించాయి. ఉత్సాహాన్ని ఊరించాయి.

ఇక ప్రక్షాళనే కాంగ్రెస్ ధ్యేయం

మితిమీరిన ప్రజాస్వామ్యం పైకి కనిపిస్తున్నా… ఏక కుటుంబ ఆరాధన.. ఏక నాయకత్వం నియంతృత్వం, గుత్తాధిపత్యం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విధ్వంసానికి ప్రధాన కారణాలు కాగా.. క్షేత్ర స్థాయిలో జన బలం లేని వ్యక్తులకు రథసారథి పగ్గాలు అప్పగించటం.. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం డొంక తిరుగుడు వ్యవహారంతో కిందిస్థాయిలో జెండా మోసే కార్యకర్త అదృశ్యమయ్యాడు. ఈ స్థితిలో పార్టీ ప్రక్షాళన అత్యవసరం అనే నిజాన్ని కాంగ్రెస్ పెద్దలు.. అధినాయకులు గుర్తించారు. ఇక పార్టీలో వికేంద్రీకరణకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి కార్యవర్గ నియామకం, తొలగింపులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి నాయకుల వ్యవహార శైలికి ఇక కళ్లెం వేస్తూ జిల్లా అధ్యక్షులకు పూర్తి అధికారాలను దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నార. అభ్యర్థుల ఎంపికలోనూ కచ్ఛితమైన దిశానిర్దేశాలు జరిగాయి. ఇక నుంచి, కేంద్ర నాయకత్వం, జిల్లా అధ్యక్షుల మధ్య ప్రత్యక్ష, క్రమబద్ధ స‌త్సంబంధాలను నెలకొల్లే ఒక కొత్త యంత్రాంగం కూడా ఏర్పాటు చేసారు. జిల్లా అధ్యక్షులు ఒక నిర్దిష్ట కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే నిర్ణయం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంస్థాగ‌తంగా పున‌రుద్ధ‌రించుకునేందుకు..
2025 ను సంస్థాగత పునరుద్ధరణ సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలను సంస్థాగత కేంద్రంగా ఎలా మార్చాలనే దానిపై ఈ వేదిక కీలకంలో చర్చించినట్లు తెలుస్తోంది. రణదీప్ సుర్జేవాలా నేతృత్వంలోని 15 మంది సభ్యుల ముసాయిదా కమిటీ ఈ తీర్మానాలను ఖరారు చేశాయి. పార్టీని ప్రక్షాళన చేయడానికి నాయకులంతా సిద్ధమయ్యారు. ఈ భేటీకి ముందే ఢిల్లీలో మూడు బ్యాచ్‌లుగా 862 జిల్లా అధ్యక్షులతో నిర్వ‌హించిన ఈ సమావేశంలో నేతలకు భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టత ఇచ్చారు అగ్రనేతలు. ఇందులో సైద్ధాంతిక శిక్షణ, సోషల్ ఇంజనీరింగ్, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఎదుర్కోవడం, పార్టీ అనుకూల కథనాన్ని రూపొందించడం.. ఎన్నికలు, నిధులు, మీడియా, సోషల్ మీడియా, పార్టీ ఆస్తులు, వాటి నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా చర్చించారు. ఇప్పటికే, కేంద్ర నాయకత్వం ఢిల్లీలో మూడు బ్యాచ్‌లుగా 862 జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించింది.

నిర్మాణాత్మ‌కంపైనే దృష్టి..

ఇప్పటి వరకూ దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఇక ఓబీసీ ఓటర్లు దూరం అయ్యారు. ఉత్తరప్రదేశ్‌‌ ఒక ఉదాహరణ, 1991 నుంచి యూపీలో కాంగ్రెస్‌ పార్టీ అధికారానికి దూరంగా ఉంది.. అక్కడ, కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు మాత్రమే మద్దతిస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోంది. గుజరాత్ లోనూ అదే స్థితి. ఇక పార్టీ నిర్మాణంలో క్షేత్రస్థాయిపైనే అగ్రనాయకత్వం దృష్టి సారించాలని.. తొలుత గుజరాత్ నుంచే ఈ క్రతువును ఆరంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలు అమలు జరిగితే.. ఫలితాలు ఎలా ఉంటాయో తెలియాలంటే.. 2027 వరకూ ఎదురు చూడక తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *