అమ్మవారి దర్శనానికి బారులు

అమ్మవారి దర్శనానికి బారులు
- వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
మక్తల్ , సెప్టెంబర్ 26 (ఆంధ్రప్రభ) : నారాయణపేట (Narayanpet) జిల్లా మక్తల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగున వెలసిన నల్లజానమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జోరు వానలోనూ అమ్మవారి ఆలయానికి భక్తులు బారులు తీరారు. 9 రోజులపాటు తెల్లవారుజామున నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి ఆలయం వద్ద స్నానాలు చేసి తడి బట్టలతో అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి చీర, రవికతో ఒడిబియ్యం నింపి మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే గురువారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. అయినా శుక్రవారం తెల్లవారుజామున అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ నల్లజానమ్మ అమ్మవారిని దర్శించుకున్న (Nallajanamma Darshan) భక్తులు అనంతరం మల్లికార్జున స్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, ఉమామహేశ్వరాలయం, పడమటి ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకుంటున్నారు. దసరా పండుగ రోజు అమ్మవారి ఆలయంలో విశేష పూజలు అనంతరం సాయంత్రం షమీ పూజ నిర్వహించి కమ్మవారి పల్లకి సేవ నిర్వహిస్తారు.

