EV Vehicles | గ్రీన్ తెలంగాణకు చేయూతనిస్తాం – ఉప ముఖ్యమంత్రి భట్టి
కాలుష్య రహితంగా హైదరాబాద్‌ను మారుస్తాం
ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి తెస్తాం
దశల వారీగా ఈవీ బస్సులు రోడ్లపైకి వస్తాయి
ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ కాకూడదనే నిర్ణయం
గ్రీన్ సమ్మిట్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి ఉద్ఘాటన
హైదరాబాద్, ఆంధ్రప్రభ: భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని చాలా వెహికల్స్‌ను బ్యాటరీ వెహికల్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో శనివారం జరిగిన గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌కు హాజరైన భట్టి.. భవిష్యత్తులో సిటీలో ఉన్న బస్సులను దశలవారీగా బ్యాటరీ బస్సులుగా మారుస్తామని చెప్పారు. ఢిల్లీ లాగా హైదరాబాద్‌ను కానివ్వబోమన్నారు. భవిష్యత్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడిపిస్తామన్నారు.
నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ..
ఫ్యూచర్ సిటీ ముఖ్యమంత్రి డ్రీమ్.. దాన్ని నెట్ జీరో సిటీగా చేయబోతున్నాం. హైదరాబాద్‌ను నెట్ జీరో నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి అన్నారు. మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో ఒక మైలు రాయి లాంటిదన్నారు. మూసీలో మంచినీళ్లు పారేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూసీ ప్రక్షాళన కోసం ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. దశాబ్ద కాలంగా స్టేట్ లో ఎనర్జీ పాలసీ లేదన్నారు. దావోస్ లో రాష్ట్రానికి లక్షా 50వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం 10 వేల కోట్లు కేటాయించాం..ఫ్లై ఓవర్లు, సబ్ వే లు నిర్మిస్తామన్నారు.
రియల్ రంగానికి సపోర్టు చేస్తాం..
రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షన్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. బిల్డర్స్ ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడూ చూడదన్నారు. గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్ట్ లకి రాష్ట్ర ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందన్నారు. తెలంగాణ యంగ్ స్టేట్ అయినా చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాము చేసేపని ప్రతిదీ రాష్ట్రాభివృద్ధి కోసమేనని చెప్పారు.