TG | ఈటల చూపు.. హుజురాబాద్ వైపే
- హుజురాబాద్ నియోజకవర్గం లో పర్యటనలు ప్రారంభించిన ఈటల
- అడుగడుగునా నీరాజనాలు, అన్నా మీరే కావాలంటున్న జనాలు
- పార్టీలకతీతంగా ఈటలనే కోరుకుంటున్న నాయకులు
- పాడవుతున్న హుజరాబాద్ ను చక్కదిద్దుతా.. అంటూ ఈటల నోట మాట
కమలాపూర్, ఫిబ్రవరి 21 (ఆంధ్రప్రభ ) : 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినప్పటికీ హుజురాబాద్ ప్రజలపై ప్రేమానురాగాలను ఏమాత్రం తగ్గించుకోలేదు ఈటల రాజేందర్. కేవలం 12నెలలలోనే హుజురాబాద్ నియోజకవర్గం అంతా నాశనం అవుతుందని బాధపడుతూ ఇక్కడి ప్రజలను కాపాడుకుంటానంటూ, హుజురాబాద్ ను మళ్లీ తీర్చిదిద్దుతానంటూ ఆయన నోట మళ్లీ మాటలు వినిపించాయి. గత రెండు రోజుల క్రితం కమలాపూర్ మండలంలో పర్యటించిన ఈటెల రాజేందర్ కు ఇక్కడి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. అయ్యా.. అన్నా.. నీవే కావాలంటూ వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు మద్దతు పలికారు. పూల వర్షం కురిపిస్తూ శాలువాలతో ఘనంగా సన్మానించారు. నీవు లేని లోటు క్షణక్షణం గుర్తుకొస్తుంది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆదుకుని కడుపులో పెట్టుకొని సాదుకున్న నిన్ను వదులుకున్నందుకు కేవలం ఏడాదిలోనే పాశ్చాత్తాపం అనుభవించామంటూ బాహాటంగానే పలువురు ఈటల ముందు తమ మనోవేదనను వెలిబుచ్చారు. చత్రపతి శివాజీ విగ్రహాలను ఆవిష్కరించేందుకు కమలాపూర్ మండలాన్ని సందర్శించిన ఈటెల రాజేందర్ రాకతో అనేక మంది కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. ఇక నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ పర్యటనలు ఉంటాయని బీజేపీ క్యాడర్ బాహాటంగానే తెలపడంతో ప్రజల్లో ఉత్సాహం కనిపించింది. తనకు హుజురాబాద్ ప్రజలు అంటేనే ఎంతో ప్రేమానురాగాలు ఉంటాయని, శామీర్ పేట్ నుండి రెండు గంటలు కారులో ప్రయాణించి హుజురాబాద్ ప్రజలను చూసిన తర్వాతనే తన మనసు ప్రశాంతం అవుతుందని స్వయంగా ఈటల రాజేందర్ పలు సందర్భాల్లో అన్న మాటలు ఆయన పర్యటనలకు బలాన్ని ఇస్తున్నాయి.
ఈటల రెండుచోట్ల పోటీ చేయడం వలన హుజరాబాద్ ప్రజలకు దూరం అవుతాడని అపనమ్మకాన్ని ప్రచారం చేసి, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు హుజురాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించి ఈటల ఓటమికి కారకులయ్యారని, గజ్వేల్ లో ఈటెల గెలుస్తున్నాడని ప్రచారం చేయడం వలన హుజురాబాద్ ప్రజలు డైలమాలో పడి ఇక్కడ గెలిస్తే రాజీనామా చేసి గజ్వేల్ లోనే ఉంటాడని గుడ్డిగా నమ్మి ఆనాడు హుజురాబాద్ ప్రజలు మోసపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈటల రాజేందర్ ఓటమికి గురైన క్షణం నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మనోవేదనకు గురవుతూ అనేక మంది అభిమానులు ఇప్పటికీ తేరుకోలేకపోతున్నారు. ఎన్నో రకాలుగా ఆదుకున్న దేవుడు లాంటి బిడ్డలను దూరం చేసుకున్నాం అంటూ బాహాటంగానే తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మళ్లీ ఈటెల రాజేందర్ రావాలంటూ గంటాపదంగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. రాజకీయ పార్టీలకతీతంగా అన్ని పార్టీల నుండి ఈటల రాజేందర్ కు మద్దతు పలికేందుకు అనేక మంది నాయకులు, కార్యకర్తలు తెరవెనుక సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. నాయకుడంటే ఈటలనే.. ఆయన వెనుక ఉంటేనే విలువ ఉంటుందని అన్ని పార్టీలకు చెందిన నాయకులు బాహాటంగానే మాట్లాడుతున్న మాటలు కూడా ఇక్కడ వినిపిస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈటల రాజేందర్ మళ్లీ హుజురాబాద్ వైపు చూస్తున్నాడని, రానున్న ఎన్నికల్లో హుజురాబాద్ నుండే పోటీ చేస్తాడని, హుజురాబాద్ లో పర్యటనలు మొదలు పెట్టడంతో ఇతర పార్టీల నాయకుల గుండెల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.