“అందరికీ సమన్యాయం”
- డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్
నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : న్యాయ సేవాధికార సంస్థ లీగల్ సర్వీసెస్ సెక్రటరీ వింధ్య నాయక్ ఆదేశాల మేరకు, నారాయణపేట పట్టణంలోని, పల్లెప్రాంత కమ్యూనిటీ హాల్‌లో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సును చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్ నిర్వహించి, న్యాయ సేవల దినోత్సవం ప్రాముఖ్యతపై పాల్గొన్న వారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1987లో చట్టపరమైన సేవల అధికారుల చట్టం (Legal Services Authorities Act) ప్రారంభమైన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం నవంబర్ 9న న్యాయ సేవల దినోత్సవం జరుపుకుంటామని తెలిపారు. సమాజంలోని పేదలు, అణగారిన వర్గాలు మరియు బలహీన వర్గాలకు న్యాయం అందించడమే ఈ దినోత్సవం ఉద్దేశ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా న్యాయ సేవల అధికారులు నిర్వహించే వివిధ ప్రచారాలు, శిబిరాలు, వర్క్‌షాప్‌ల ద్వారా ఉచిత న్యాయ సహాయం లభ్యతపై ప్రజల్లో చైతన్యం పెంచుతారని వివరించారు.
2023లో నారాయణపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) ఏర్పాటు చేయబడినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సేవలపై అవగాహన, లోక్ అదాలత్‌లు, అవగాహన శిబిరాలు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు (ADR) వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉచిత న్యాయ సేవల(Free legal services)కు అర్హులైన వారిలో మహిళలు, పిల్లలు, వైకల్యం ఉన్నవారు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, పారిశ్రామిక కార్మికులు, కస్టడీలో ఉన్నవారు, ప్రకృతి వైపరీత్యాలు లేదా కులహింస బాధితులు, వార్షిక ఆదాయం రూ.1,00,000/- కంటే తక్కువ ఉన్నవారు ఉన్నారని వివరించారు.
అలాగే చట్టపరమైన సలహా లేదా ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నంబర్కు కాల్ చేసి తమ సమస్యను తెలియజేస్తే, లీగల్ సర్వీసెస్ సంస్థ(Legal Services Firm) ద్వారా అవసరమైన సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కె. లక్ష్మిపతి గౌడ్, మున్సిపల్ అధికారి మహమ్మద్ అజీమ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

