Endapalli | తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం

Endapalli | తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం
- పిట్ల కృష్ణ మహారాజ్
Endapalli | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలోని అశోక్ సాగర్ చెరువుకట్ట వద్ద రెండేళ్ల క్రితం శివరాత్రి రోజున స్వయంభువుగా వెలసిన శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహా స్వరూపాలను మల్లారం ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహా రాజ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభు శివాలయాన్ని సందర్శించేందుకు విచ్చేసిన పిట్ల కృష్ణ మహారాజ్ కు భక్తులు, గ్రామస్తులు సాదరంగా స్వాగతం పలికారు.
అలాగే స్వయంభుగా వెలిసిన శివలింగం నందీశ్వర విగ్రహాల సమీపంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మిస్తున్న శివాలయాన్ని ఆయన పరిశీలించారు. ఆలయ ఆవరణలో నిర్మాణం జరుగుతున్న గర్భగుడి, మండపం, గోపురం పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఆలయ గర్భగుడిలో శివలింగ ప్రతిష్ఠ కోసం చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలపై ఆలయ కమిటీ సభ్యులకు ఆయన సూచనలు చేశారు. ఆలయ నిర్మాణం పనులను షెడ్యూల్‌కు అనుగుణంగా పూర్తి చేయాలని, భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, తాగునీరు, శౌచాలయాల వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

అనంతరం భక్తులతో ఏర్పాటు చేసిన సమావేశ కార్యక్రమంలో హైందవ ధర్మం విశిష్టతపై ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు. భక్తి మార్గం అనేది హిందూ ఆధ్యాత్మికతలో దేవుని పట్ల అచంచలమైన భక్తి ద్వారా మోక్షాన్ని పొందే మార్గమని, ఇది కర్మ, జ్ఞాన, యోగ మార్గాలతో పోల్చబడినప్పుడు కలియుగంలో అతి సులభమైన మార్గంగా పరిగణించబడుతుందని భక్తులకు సూచించారు. భక్తి మార్గం ఒక్కటే ముక్తి అని, ఇది మానసిక ఒత్తిళ్లను, శారీరక రుగ్మతలను దూరం చేస్తుందనీ తెలిపారు.
దైవారాదనతో పాటు తల్లిదండ్రుల ఆదరణ సైతం అత్యంత ముఖ్యమని, తల్లిదండ్రుల సేవే నిజమైన భక్తి అని తెలిపారు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం కంటే ఉగాది మన భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉన్న అసలైన నూతన సంవత్సరం అని వివరించారు. తన ఆశీర్వచనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూ లైన్ లలో నిలిచిన భక్తులకు పిట్ల కృష్ణ మహారాజ్ స్వయంగా వెళ్ళి విభూది బొట్టును పెట్టి ఆశీర్వదించారు. ఆలయం వద్ద భజన మండలి సభ్యులు ఆలపించిన భజన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్న దాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసిన భక్తులతో పాటు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
