ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపాలి…

ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపాలి…
నిర్దిష్ట గడువులోపు సమస్య పరిష్కారానికి కృషిచేయాలి..
జిల్లాస్థాయి పీజీఆర్ఎస్‌కు 112 అర్జీలు
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. జేసీ ఇలక్కియ, అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 112 అర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకు 31, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 24, పోలీసు శాఖకు 14, పంచాయతీరాజ్‌కు 9 అర్జీలు వచ్చాయి.
విద్యుత్ 4, ఆరోగ్యం 4, విభిన్న ప్రతిభావంతుల శాఖ 3, ఇరిగేషన్‌కు 3 అర్జీలు వచ్చాయి. ఇదేవిధంగా డీఆర్‌డీఏ, విద్య, దేవాదాయ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, పశుసంవర్థక, జెడ్‌పీ సీఈవో, పౌరసరఫరాలు, సహకార, అడవులు, గృహనిర్మాణం, కార్మికశాఖ, మార్క్‌ఫెడ్, మార్కెటింగ్, రహదారులు-భవనాలు, గ్రామీణ నీటి సరఫరాకు ఒక్కో అర్జీ వచ్చాయి.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కు అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. ఈ కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు సత్వరం పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి అధికారులతో నిరంతర సమన్వయంతో అర్జీల పరిష్కారానికి కృషిచేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసిహం, పీజీఆర్ఎస్ కోఆర్డినేటర్ జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
