చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం (health), ఆనందమని, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రత పై బాధ్యత కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumit Kumar) పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు పట్టణం (Chittoor Town) లోని గంగినేని చెరువు (Gangineni Lake) వద్ద స్వచ్ఛతహి సేవ 2025లో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, నగర మేయర్ అముద, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వచ్ఛతహి సేవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర (Swarnandhra Swachh Andhra) కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 10 రోజుల పాటు శ్రమదానం కార్యక్రమం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలమని, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. చిత్తూరు జిల్లాలో సుమారు 2 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారని, వారి విధులు ఉదయం 4.30 గం.ల నుండి ఉ.10 గం. ల వరకు పని చేస్తున్నారన్నారు.
నగరంలో ప్రతి రోజూ ఏర్పడే చెత్తలో సుమారు 50 శాతం బాధ్యత లేకుండా ప్రజలు పడవేసినవే ఉంటాయన్నారు. పార్కులు, బస్ స్టాండ్, మార్కెట్ లు, పుర వీధులలో ప్లాస్టిక్ కవర్లు, బాటిల్ లు, బిస్కట్ , చాక్లెట్ కవర్ లు, ఇలా చెత్తను భాధ్యత లేకుండా పడేస్తున్నారని, దీని కారణంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ సమస్యలను ఎదుర్కొంటున్నారని, పని భారం పెరుగుతుందన్నారు. నాగరికులుగా సమాజంలో పారిశుద్ధ్యం పై ప్రజలు కొంచం దృష్టి పెట్టి చెత్త బుట్టలను వాడడం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు సహాయంగా ఉంటుందన్నారు. విద్యార్థులు కూడా పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కలిగి ఉండి, వారి తల్లిదండ్రులను ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆలయాలు, మసీదులు, చర్చి ల వద్ద మెరుగైన పారిశుధ్యం ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించిందన్నారు.
దీనితో పాటు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాల వద్ద పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యం నిర్వహించాలని ఆదేశించిందన్నారు. చిత్తూరు పట్టణంలో సుమారు 1.75 లక్షల మంది ప్రజానీకం ఉన్నారని, వీరు ప్రతి నెల స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం ద్వారా కాలనీలు, వీధులలో మొక్కలను నాటాలని కోరారు. మొక్కలు నాటాడడం ద్వారా పచ్చదనం పెరుగుతుందని, వాతావరణం చల్లబడుతుందని, ఆరోగ్యమైన వాతావరణం ఉంటుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ లు నిర్వహిస్తున్నారన్నారు. కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ సిబ్బంది పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమం లో నిమగ్నమై ఉన్నారన్నారు.
నగరపాలక మేయర్ మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడుల సూచనలతో స్వచ్చతా హి సేవా కార్యక్రమం నిర్వహించుకుంటున్నామన్నారు. నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు పని భారం పెరిగిపోయిందని, ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చెత్తబుట్టలో పడవేయాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛతా హి సేవలో భాగంగా మాస్ సానిటేషన్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సచివాలయ సెక్రెటరీ లు ఎన్ జి ఓ లతో సమన్వయం చేసుకుని ప్రజల భాగస్వామ్యంతో సానిటేషన్ డ్రైవ్ నిర్వహించామన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అందరి బాధ్యతగా ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆలయాలు, చర్చిలు, మసీదుల వద్ద కూడా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అనవసరమైన వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడం, వ్యర్థాల నుండి సంపద సృష్టి చేయడం ద్వారా మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ సాధ్యమవుతుందన్నారు.