- పార్టీ లో అందరికీ ప్రాధాన్యత
- స్థానిక సంస్థల విజయాల కోసం కృషి చేయాలి
- కాంగ్రెస్‌లో భారీ చేరికలు
ధర్మపురి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని, కొత్త–పాత అనే తేడా లేకుండా ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గురువారం రాత్రి ధర్మపురి మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నాయకులు భారీగా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దమ్మున్నపేట, రాజారం, నక్కలపేట గ్రామాల నుంచి వందకు పైగా కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పెద్ద నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌళ్ల భీమయ్య, జైన సహకార సంఘం అధ్యక్షుడు సౌల్లా నరేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిలి శేఖర్, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొని కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరందరికీ మంత్రి లక్ష్మణ్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు.
మంత్రి మాట్లాడుతూ, “తెలంగాణలో విజన్ ఉన్న నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. 2047 నాటికి తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై సీఎం రేవంత్ రెడ్డి ముందుచూపుతో పని చేస్తున్నారు. అదే దారిలో మేము మంత్రులు పనిచేస్తున్నాము’’ అన్నారు.
రాబోయే పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గోదావరి తీర ప్రాంతంలోని ఆలయాలను అభివృద్ధి చేసి పుష్కర సందర్శకులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.
“ఇప్పుడే పార్టీలో చేరిన నాయకులు గతంలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చారు. ఇకపై కూడా ప్రభుత్వం, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలి’’ అని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సాగునీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
“నియోజకవర్గ పెద్దగా, అన్నగా, కుటుంబ పెద్దగా అందర్నీ కాపాడుకుంటాను. కొత్తగా వచ్చిన వారితోపాటు పాత నాయకులు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా అందరికీ సమానంగా ప్రాధాన్యత ఉంటుంది’’ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్, పట్టణ అధ్యక్షుడు చిపిరిశెట్టి రాజేష్, మండల ఉపాధ్యక్షుడు వేముల రాజేష్, ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ తదితరులు, అలాగే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

