మయన్మార్ : మయన్మార్ లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.1గా నమోదైందని నిపుణులు చెబుతున్నారు. వరుస భూకంపాల వల్ల ఇప్పటి వరకు 1700మందికి పైగా తీవ్రగాయాల పాలు కాగా, వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం 7.8 తీవ్రతతో తుర్కియే, సిరియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం మూలంగా దాదాపు 53వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే అని పేర్కొంటున్నారు.
ఇక మయన్మార్ రాజధాని నేపిడా వద్ద ప్రధాన రహదారులు భూకంపం తీవ్రతకు ధ్వంసమయ్యాయి. దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన మాండలే ప్రాంతంలో ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడ పలు భవనాలు కుప్పకూలిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ నగరం భూకంప కేంద్రానికి అతి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఒకటని అమెరికా జియోలాజికల్ సర్వే విభాగం పేర్కొంది.