Driving seat |కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

Driving seat | కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం…

Driving seat | కంచికచర్ల, ఆంధ్ర‌ప్ర‌భ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం నాలుగు గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఫ్లై యాష్ లోడ్ తో వెళుతున్న ట్యాంకర్ లారీ, ముందు వెళుతున్న కారుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న హైకోర్టు అడ్వకేట్ బుద్దులూరి శ్రీనివాసరావు (55) కారు డ్రైవింగ్ సీట్ లోనే చితికిపోయి మృతి చెందాడు. కారు పూర్తిగా నజ్జునుజు అయింది.

ట్యాంకర్ లారీ కారుపై బోల్తా పడిన సంఘటనలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు మృతి…
క్రేన్లు జెసిబిలతో టాంకర్ లారీని తొలగించేందుకు విశ్వప్రయత్నం…
ట్యాంకర్ లారీ రూపంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావును వెంటాడిన మృత్యువు

ఈ దుర్ఘటన ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల ప్రాంతంలో చోటుచేసుకుంది. ట్యాంకర్ లారీ రూపంలో హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావును మృత్యువు వెంటాడింది. సేకరించిన వివరాల ప్రకారం హైకోర్టు అడ్వకేట్ బుద్దులూరి శ్రీనివాసరావు స్వగ్రామం గుంటూరు జిల్లా పెద్దకాకాని. హైకోర్టులో న్యాయవాద వృత్తిరీత్యా గత 30 ఏళ్లుగా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తరచుగా ఆంధ్ర హైకోర్టుకు శ్రీనివాసరావు విజయవాడ వచ్చి తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ ఒంటరిగా వెళుతూ ఉంటాడు.

విజయవాడ వచ్చి శనివారం తిరుగు ప్రయాణం హైదరాబాద్ వెళుతూ కీసర టోల్గేట్ వద్దకు శనివారం నాలుగు గంటల పది నిమిషాల ప్రాంతంలో చేరుకున్నాడు. టోల్ బూత్ వద్ద వేచి ఉన్న సమయంలో టోల్గేట్ అదే లైన్‌న్లో వెనుక నుంచి వేగంగా ఫ్లై యాష్ లోడుతో ఇబ్రహీంపట్నం నుండి జగ్గయ్యపేట వెళుతున్న ట్యాంకర్ లారీ అదుపుతప్పి, ముందు ఉన్న కారును తప్పించపోయి డివైడర్ను ఢీ కొట్టి డివైడర్ ఎక్కి, బూత్ కు ముందు వైపు రక్షణగా ఉన్న బుల్ నోస్ ను ఢీ కొట్టి ఎడమవైపు శ్రీనివాసరావు కారు మీద ట్యాంకర్ ఒరిగి పడింది.

దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో డ్రైవింగ్ సీట్ లో ఉన్న అడ్వకేట్ శ్రీనివాసరావు కారులో ఉన్నపళంగా చితికిపోయి మృతి చెందాడు. హుటాహుటిన టోల్ ప్లాజా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నది తెలియక, అందరూ మృతి చెంది ఉంటారని ప్రతి ఒక్కరూ ఆందోళనకు గురయ్యారు.

క్రేన్లు, జేసీబీలలతో టాంకర్ లారీని తొలగించే ప్రయత్నం…

సమాచారం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు టోల్గేట్ సిబ్బంది సహాయంతో క్రేన్లు, జెసిబి లు రప్పించి కారు పై పడిపోయిన ట్యాంకర్ లారీని తొలగించేందుకు విశ్వప్రయత్నం చేశారు. సుమారు రెండు గంటల పాటు పోలీసులు టోల్గేట్ సిబ్బంది కారు మీదపడి ఉన్న ట్యాంకర్ ను క్రేన్లు, జేసీబీల సాయంతో తొలగించేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఫ్లై యాష్ ఫుల్ లోడుతో భారీ బరువు ఉన్నందున క్రేన్లకు ఒక పట్టానా ట్యాంకర్ తొలగించడం సాధ్యం కాలేదు.

గొలుసులు బిగించి ట్యాంకర్ ను కొంచెం పైకి లేపి కారును వేరే జెసిబి తో ముందుకు లాగడంతో కారు బయటకు వచ్చింది. కార్ డ్రైవింగ్ సీటులో ఉన్న అడ్వకేట్ శ్రీనివాసరావు కారులో విగత జీవుడిగా పడి ఉన్నాడు. పోలీసులు కార్ డోర్ తొలగించి శ్రీనివాసరావు మృతదేహాన్ని అంబులెన్స్ లో నుండి నందిగామ మార్చురికి తరలించారు. కార్లో ఎంతమంది ఉన్నారు తెలియక, ఉన్న వారందరూ చనిపోయి ఉంటారన్న ఆందోళనతో భారీ ఎత్తున ప్రజలు గుమికూడారు. అత్యవసర సహాయమందించేందుకు పోలీసులు అంబులెన్సులు, ఫైర్ ఇంజన్ ను కూడా సంఘటనా స్థలానికి రప్పించారు.

లారీని పక్కకు లాగుతున్న సమయంలో లారీలో డీజిల్ కారిపోయి ఫైర్ అవుతుందేమో అని భయాందోళన వ్యక్తం అయ్యాయి. సహాయక చర్యల్లో కంచికచర్ల టోల్గేట్ సిబ్బందితోపాటు నందిగామ ఏసీపి తిలక్, సీఐ చవాన్, ఎస్ఐ పి. విశ్వనాథ్, సిబ్బందితోపాటు నందిగామ సబ్ డివిజన్లోని పలువురు ఎస్సైలు సీఐలు పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

Leave a Reply